AP Govt Schemes: ఏపీ ప్రభుత్వం మూడు పథకాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఎప్పుడెప్పుడు అంటూ ప్రజలు ఎదురుచూస్తున్న ఆ మూడు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ మూడు పథకాలు ఏమిటి? ప్రజలకు ఎలా లబ్ధి చేకూరుతుందో తెలుసుకుందాం.
ఏపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే కూటమిపాలనలో సంక్షేమ పథకాల అమలుకు స్పష్టతనిస్తూ ఒక సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలో అమలు చేయబోయే సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ఈ క్యాలెండర్ను సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించనున్నారు.
తల్లికి వందనం..
తల్లికి వందనం స్కీం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15 వేలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గత వైసిపి ప్రభుత్వం హయాంలో అమలైన అమ్మఒడి పథకాన్ని కొనసాగిస్తూ, కొన్ని కీలక మార్పులను ప్రభుత్వం చేపట్టింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15 వేలు జమ చేయనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు చెప్పుకొచ్చారు.
అన్నదాత సుఖీభవ..
ఈ పథకం రైతులకు ఒక వరమని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ సందర్భంగానే మూడు విడతలుగా ప్రతి రైతుకు రూ. 20 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంతో రాష్ట్రంలోని లక్షలాది రైతులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.
పింఛన్ పథకం..
రాష్ట్రంలో గల లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను సైతం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలోకి రాగానే పింఛన్ పెంపును రెట్టింపు చేసిన ప్రభుత్వం, పలు నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. దీనితో ఎందరో పింఛన్దారులకు ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు.
Also Read: pawan Kalyan: పవన్ ఓ అబద్ధాల కొరివి.. నీది నాలుకేనా అంటూ నిర్మాత ఫైర్
జూన్ 12న మూడు పథకాలకు శ్రీకారం
జూన్ 12వ తేదీన ముఖ్యమైన ఈ మూడు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడు పథకాలను ఒకేరోజు ప్రారంభించి రాష్ట్రంలోని లక్షలాది ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందని, అంతేకాకుండా సంక్షేమ క్యాలెండర్ ను సైతం విడుదల చేస్తుందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.