Kidney Care: మన శరీరంలో కిడ్నీలు చూడడానికి చాలా చిన్నగా కనిపించినా, అవి చేసే పని మాత్రం ఎక్కువే ఉంటుంది. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు, అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అంతే కాదు, రక్తపోటును నియంత్రించడం, ఉప్పు సమతుల్యం చేయడం, ఎర్ర రక్త కణాల తయారీ, ఎముకల బలానికి సాయం చేయడం కూడా వీటి పనే.
కానీ, ఈ మూత్రపిండాలకు సమస్య వస్తే, అది నిశ్శబ్దంగా వచ్చి పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. హైదరాబాద్‌లోని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో నిపుణుడైన డాక్టర్ పి. ఎస్. వలి హెచ్చరిస్తున్నారు. మూత్రపిండ వ్యాధులు నిశ్శబ్దంగా వస్తాయని ఆయన అంటున్నారు. 90% పనితీరు పోయినా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని చెబుతారు.
కారణాలు
కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు షుగర్ వ్యాధి (డయాబెటిస్), అధిక రక్తపోటు (హై బీపీ). షుగర్ నియంత్రణలో లేకపోతే, అది మూత్రపిండ కణజాలాన్ని క్రమంగా దెబ్బతీస్తుందట. అలాగే, హై బీపీ రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాల పనిని కష్టతరం చేస్తుంది. యువకుల్లో హై బీపీ ఉంటే, అది మూత్రపిండ సమస్యల సూచన కావచ్చు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ వలి సలహా ఇస్తారు. అంతే కాదు, కుటుంబంలో మూత్రపిండ సమస్యల చరిత్ర ఉన్నవారు, ఎక్కువ కాలం నొప్పి నివారణ మందులు వాడినవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
లక్షణాలు
మూత్రపిండ సమస్యలు మొదట్లో లక్షణాలు చూపకపోవచ్చు, కానీ కొన్ని సంకేతాలను గమనిస్తే ముందస్తుగా గుర్తించవచ్చు.
కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అదనపు నీరు శరీరంలో నిలిచి కాళ్లు, కళ్ల చుట్టూ వాపు వస్తుంది. మూత్రపిండ సమస్యల వల్ల రక్తపోటు పెరిగి, దాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. మూత్రం ఎక్కువగా నురగడం అంటే ప్రోటీన్ లీక్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
మూత్రం టీ లేదా కోలా రంగులో ఉంటే, అది తీవ్రమైన సమస్య లేదా మూత్రంలో రక్తం ఉన్నట్టు సూచిస్తుందట. రాత్రి తరచూ బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తే, అది మూత్రపిండ సమస్య సంకేతం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
కిడ్నీలు పాడైపోవడం వల్ల చాలా మందిలో కాళ్లో వాపు వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే టెస్ట్‌లు చేయించుకోవడం ఉత్తమం.
మూత్రంలో రక్తం కనిపిస్తే, అది సాధారణం కాదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్, మూత్రపిండ రాళ్లు లేదా వ్యాధి సంకేతం కావచ్చట.
పరీక్షలు ఎందుకు?
కిడ్నీలు బలంగా ఉన్నప్పటికీ, ఒకసారి దెబ్బతింటే ఆ నష్టం శాశ్వతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. షుగర్, హై బీపీ ఉన్నవారు, కుటుంబంలో మూత్రపిండ సమస్యల చరిత్ర ఉన్నవారు, ఎక్కువ కాలం నొప్పి మందులు వాడినవారు సంవత్సరానికి ఒకసారి మూత్రపిండ పనితీరు పరీక్ష చేయించుకోవాలి.
జాగ్రత్తలు
మూత్రపిండ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.