TDP : తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. లీడర్లు వస్తుంటారు పోతుంటారు.. టీడీపీ మాత్రం అలానే ఠీవీగా నిలుచుని ఉంటుంది. అది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి నారా లోకేశ్ వరకు.. సైకిల్ జెండా కింద రాటుదేలిన నేతలెందరో. సీనియర్లు, జూనియర్ల సమతూకం పసుపు దళం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 79 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 34 ఏళ్ల పల్లె సింధూర పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అట్లుంటది మరి టీడీపీలో.
హ్యాట్రిక్ కొడితే అవుట్
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. పార్టీలో 3 కంటే ఎక్కువ సార్లు ఒకటే పోస్టులో ఏ లీడర్‌నూ కొనసాగించకూడదని సూచించారు. సుదీర్ఘ కాలంగా ఒకే పదవిలో ఉంటున్న వారికి ఆ పై స్థాయి పదవి కానీ, సమానమైన మరో పోస్ట్ కానీ ఇవ్వాలని అన్నారు. అవసరమైతే తన పదవిని సైతం మార్చాలని చెప్పారు. కొత్త వారికి అవకాశాలు పెంచాలని అన్నారు. లోకేశ్ ప్రతిపాదనకు ఆనాడు అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. వరుసగా మూడుసార్లు ఒకే పదవి అంటే.. చంద్రబాబు, లోకేశ్, అచ్నెన్నాయుడు ఇలా పార్టీలోని సీనియర్ల పదవులన్నీ మారుతాయి. అంతకుమించి హోదా కానీ, మరో స్థాయి పదవి కానీ వారిని వరిస్తాయి అంటూ చర్చ జరిగింది. లోకేశ్ ప్రతిపాదనపై లేటెస్ట్‌గా టీడీపీ పొలిట్ బ్యూరోలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. చిన్న మార్పుతో పెద్దల పదవులన్నీ సేఫ్‌గా ఉంచారు.
మార్పు మంచిదే.. మరి, మాకో?
పార్టీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదనే నిర్ణయాన్ని కేవలం మండల స్థాయికే పరిమితం చేశారు. వరుసగా 3 సార్లు.. అనగా ఆరేళ్లు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారందరినీ మార్చేయాలని నిర్ణయించారు. వారికి ఆ పైస్థాయి పదవి కానీ, అదే స్థాయిలో మరో హోదా కానీ కట్టబెట్టనుంది పార్టీ. అంటే.. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న నేతలంతా సేఫ్. ప్రయోగాత్మకంగా మండల అధ్యక్షులను ఈసారి మార్చుతామని.. ఫలితాలు బాగుంటే.. క్రమక్రమంగా ఇదే విధానం మిగతా స్థాయి పదవులకూ వర్తింపజేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. నారా లోకేశ్ సూచించిన ఐడియా మాత్రం సూపర్‌గా ఉంది.. కానీ, అమలులోనే మెలిక ఉందంటూ తమ్ముళ్లు అప్పుడే గుసగుసలు మొదలుపెట్టారు. కేవలం మండల పార్టీ అధ్యక్షులేనా మారేది? మిగతా స్థాయిలోనూ మార్పు మంచిదే అంటున్నారు. ఇప్పటికే పదవులపై ఆశల పల్లకిలో విహరిస్తున్న నేతలంతా తాజా నిర్ణయంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారనే అంటున్నారు. అయితే, మండల స్థాయి నేతల్లో మాత్రం కొత్త జోష్ కనపడుతోంది. ఆ పదవి తమకంటే తమకే అంటూ అప్పుడే లాబీయింగ్ కూడా స్టార్ట్ చేశారు కొందరు నేతలు. తమ్ముళ్ల జోష్ మామూలుగా లేదు మరి.
Also Read : దెబ్బకు మూడు వికెట్లు డౌన్.. వైసీపీకి దిమ్మతిరిగే షాక్