AP New Scheme 2025: ఏపీ ప్రభుత్వం మాత్రం రోజుకొక కానుకల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు కేవలం మహిళలనే దృష్టిలో ఉంచుకొని సరికొత్త స్కీమ్ ను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే తల్లికి వందనం స్కీమ్ పేరుతో ప్రతి మహిళ ఖాతాలో రూ. 15 వేలు జమయ్యే రోజు దగ్గరపడింది. కానీ ఇప్పుడు మరో కొత్త స్కీమ్ తో మళ్లీ డబ్బులు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇంతకు ఆ కొత్త స్కీమ్ ఏంటి? ఎవరికి లబ్ది? ఎంత నగదు జమ కానుందో తెలుసుకుందాం.
కొత్త పథకం పేరు ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక సంక్షేమానికి కీలకమైన మరో కీలక చర్యకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా కొంత చేయూతగా ఉండేలా ‘గృహిణి’ పథకం పేరుతో కొత్త స్కీమ్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత ఉన్న కాపు మహిళకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేయాలనే ప్రతిపాదన పై అధికార వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.
గృహిణులకు ఆర్థిక శక్తి
ఇటీవలి కాలంలో మహిళా సాధికారత మీద ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం ద్వారా కుటుంబంలో వారి పాత్ర మరింత బలపడుతుంది. ఇలాంటి సమయంలో ‘గృహిణి’ పథకం రూపంలో మహిళలకు నేరుగా నగదు రూపంలో ఆర్థిక మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి మహిళల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను ఇది చాటుతోంది.
కాపు మహిళల కోసం ప్రత్యేక దృష్టి
ఈ పథకం ప్రత్యేకంగా కాపు వర్గానికి చెందిన మహిళల కోసం రూపొందించబడనుంది. గతంలో ‘వైఎస్‌ఆర్ కాపు నేస్తం’ వంటి పథకాల ద్వారా ప్రభుత్వానికి చెందిన వివిధ వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించిన నాటి స్కీమ్ ను, ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం ఈ కొత్త పథకం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన గృహిణుల జీవితాల్లో వాస్తవిక మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంత మంది మహిళలకు లబ్ధి?
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల కాపు మహిళలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని అంచనా. ప్రతి మహిళకు రూ.15,000 చొప్పున ఇవ్వాలంటే మొత్తం ఖర్చు రూ.400 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని అందించేందుకు అవసరమైన నిధుల కేటాయింపు మీద ప్రభుత్వం, కాపు సంక్షేమ కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇదొక చరిత్రనే
ఇలాంటి స్కీమ్‌లు కేవలం ఆర్థిక లబ్ధికే పరిమితమవ్వక, సమాజంలో మహిళలకు ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడతాయి. స్వంత వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే మహిళలకు ఇది ఒక మాంచి ఆరంభ మద్దతుగా మారవచ్చు. అంతేకాదు, విద్య, వైద్యం, చిన్నచిన్న పెట్టుబడుల కోసం సొంత డబ్బుతో పని చేయడానికి వీలు కలుగుతుంది.
Also Read: Indian Railways Wonders: ఈ రైల్వే స్టేషన్ లేకుంటే.. ఏపీలో ఎక్కడి రైళ్లు అక్కడే..
లబ్ధిదారుల ఎంపిక ఎలా?
ఈ పథకానికి స్పష్టమైన అర్హత ప్రమాణాలు ఉండేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా కుటుంబం ఆదాయం, మహిళ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఉండటం, గతంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందినదో లేదో వంటి విషయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల డేటాను సిద్ధం చేయడం, వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేసే విధానం అవలంబించనున్నట్లు సమాచారం.
ప్రత్యక్ష నగదు బదిలీ విధానం
ప్రతిపాదిత పథకం క్రింద డబ్బును నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది అవినీతి లేకుండా, వేగంగా అమలయ్యే విధానంగా పనిచేస్తుంది. గృహిణులు స్వయంగా డబ్బును ఎలా వినియోగించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి, కుటుంబ అభివృద్ధికి బలంగా నిలుస్తుంది.
త్వరలో అమలు?
ఈ పథకం గురించి తాజాగా మాట్లాడిన కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇది త్వరలోనే అమలవుతుందన్న సంకేతాలు ఇచ్చారు. స్కీమ్‌కు అవసరమైన రూ.400 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించామని, ప్రభుత్వంతో చర్చలు చివరి దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇంతవరకూ ప్రభుత్వ పథకాలు పేదల అభ్యున్నతికి దోహదపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘గృహిణి’ పథకం ద్వారా కాపు వర్గానికి చెందిన గృహిణులకు మరింత బలం లభించనుంది. ఇది ఒక విధంగా మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వంచేసే మరో అడుగుగా చూడవచ్చు. ఈ స్కీమ్ సజావుగా అమలయితే, వేలాది మంది కుటుంబాలు దీని వల్ల లబ్ధి పొందుతాయి.