AP Intermediate: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులు ఉత్తమ మార్కుల సాధనకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో మార్చి ఒకటి నుండి పరీక్షలు ప్రారంభం కానుండగా, తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే విద్యార్థుల్లో తెలియని ఆందోళన ఉండడం సహజం. అలాగే విద్యా సామర్థ్యం తక్కువగా ఉన్న విద్యార్థుల్లో ఇలాంటి ఆందోళనలు సహజం.
కొందరు విద్యార్థులకు చదువుపై పట్టు ఉన్నా, పరీక్షపై ఉండే భయంతో చదివిన చదువును కూడా మరచిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా సాధన చేయాలి? తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా? పరీక్షకు సిద్దమయ్యే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్ధశాస్త్ర అధ్యాపకులు అబ్బూరి అల్లూరయ్య ఎక్స్ క్లూజివ్ గా బిగ్ టీవీ లైవ్ తో వివరించారు.
ఇలా ప్రిపేర్ కండి
ఇంటర్ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే ఉత్తమ మార్కులు సాధించడం సులువని అధ్యాపకులు అల్లూరయ్య అన్నారు. ఇప్పటి వరకు చదివిన విషయాలను పదే పదే రాయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని చదవడం ద్వారా, సమయం వృథా కాదన్నారు. అలాగే కఠినమనే భావన గల సబ్జెక్ట్ పై కాస్త దృష్టి సారించి చదవాలని, అప్పుడే విద్యార్థులకు సబ్జెక్ట్ పై గల భయం తొలిగే అవకాశం ఉందని సూచించారు. ప్రతి రోజూ ఉదయాన్నే ధ్యాన సాధన చేసి పుస్తక పఠనం సాగిస్తే ఏకాగ్రత పెరుగుతుందన్నారు.
ఒత్తిడిని ఓడిస్తే.. ఉత్తమ మార్కులు మీ సొంతం
విద్యార్థులు ముందుగా పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి పొందడం ద్వారా చదివిన చదువు కూడా మరచిపోయే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైతే ఏకాగ్రత తగ్గుతుందని, అందుకే ఉండే తక్కువ సమయంలో ఇష్టపూర్వక చదువు సాగించాలన్నారు. అప్పుడే ఉత్తమ మార్కుల సాధనకు మార్గం సులువుగా ఉంటుందని సూచించారు. మనసులో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అటువంటి భయాలు పోగొట్టుకొనేందుకు ఎక్కువగా తమ తోటి విద్యార్థులతో సబ్జెక్ట్ పై చర్చించాలని అల్లూరయ్య సూచించారు.
పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి
ఇంటర్ పరీక్షకు వెళ్ళే విద్యార్థులు తమ సబ్జెక్ట్ లకు సంబంధించిన పాత మోడల్ పేపర్స్ ను సాధన చేయాలి. పదే పదే వచ్చే ప్రశ్నల గురించి అధ్యాపకుల ద్వారా తెలుసుకొని, వాటిని మరింతగా సాధన చేయాలి. అప్పుడే అధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తక్కువ కాల వ్యవధి ఉన్న కారణంగా కొత్త అంశాల జోలికి వెళ్ళకుండా, చదివిన అంశాలపై పట్టు సాధించడం అవసరం.
విద్యా సామర్థ్యం తక్కువగా ఉందా?
విద్యా సామర్థ్యం తక్కువగా ఉన్న విద్యార్థులతో తల్లిదండ్రులు, అధ్యాపకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారికి అవసరమైన సలహాలు ఇవ్వాలి కానీ, నిరాశకు గురి చేసే మాటలకు దూరంగా ఉండాలి. అయితే ఇలాంటి విద్యార్థులు అధిక మార్కులు సాధించే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువగా రెండు మార్కుల ప్రశ్నలపై దృష్టి సారించాలి. ఎక్కువగా చదవడం కంటే చదువుతూ.. రాయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సాధించగలమనే ధీమాను వీరిలో కల్పించాలి. అప్పుడే వీరు ఉత్తమ మార్కులు కూడా సాధించే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులూ.. పిల్లలతో ఇలా మెలగండి
పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు వారి విద్యా సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సంధర్భంగా టీవిలను ఆన్ చేయక పోవడం మంచిదన్నారు. అలాగే మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉంచేలా విద్యార్థులను సుత్తిమెత్తని ధోరణితో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర విద్యార్థులతో తమ పిల్లలను పోల్చే అలవాటును తల్లిదండ్రులు విడనాడాలి. తమ పిల్లల విద్యా సామర్థ్యానికి అనుగుణంగా వారి పుస్తక పఠనం తీరును గమనించి తగిన సలహాలు ఇవ్వాలి. అంతేకానీ విద్యార్థులలో నిరాశ నిస్పృహ వచ్చే రీతిలో మాట్లాడడం ఆపాలి. అప్పుడే విద్యార్థులు మంచి వాతావరణంలో పుస్తక పఠనం సాగిస్తారు.
Also Read: సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని.. డోంట్ రిపీట్ అంటూ సజ్జనార్ మళ్లీ వార్నింగ్
అలాగే పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి విద్యార్థి కాస్త ఇష్టపడి చదివితే ఉత్తమ మార్కులు సాధించడం సులువని అల్లూరయ్య అన్నారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగా వెళ్లిన విద్యార్థులకు పరీక్ష హాల్ వాతావరణం అనుకూలంగా మారుతుందని, ఈ విషయాన్ని కూడా విద్యార్థులు గమనించాలన్నారు. మానసిక ఒత్తిడి, పరీక్షలపై భయాన్ని పోగొట్టుకొని ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించాలని అధ్యాపకులు అల్లూరయ్య ఆకాంక్షించారు.