Pawan Kalyan project: ఆ ప్రాంతాల ప్రజలు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న సౌకర్యం చివరికి వారి గడపకు రానున్న సమయం ఆసన్నమైంది. కొండలు, అడవులు, లోయల మధ్య ఉంటూ రోడ్డు అనే మాట విని కూడా చూడని గిరిజన ఆవాసాల జీవితం ఇక పూర్తిగా మారబోతోంది. ఒక నిర్ణయం, ఒక ప్రణాళిక ఇప్పుడు వారిని అభివృద్ధి దిశగా నడిపించబోతుంది. ఈ ప్రణాళిక పూర్తయ్యే సరికి, ఆ ప్రాంతాల ప్రజలకు ఇది నిజమైన పండుగవలె మారనుంది. ఇంతకు ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరో కాదు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.
‘అడవి తల్లి బాట’
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ‘అడవి తల్లి బాట’ పేరుతో చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు రహదారి సౌకర్యం అందనుంది.
రూ.1005 కోట్లతో భారీ ప్రాజెక్ట్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పీఎం జన్ మన్ పథకం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులు కలిపి మొత్తం రూ. 1005 కోట్లతో చేపట్టబడింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని ఆవాసాలను కూడా అనుసంధానించేలా రెండు దశల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
సవాళ్లు, అవరోధాలు.. కానీ అడుగులు ఆగవు
అధికారులు సమావేశంలో పనుల ప్రస్తుత స్థితి వివరించారు. కొండలపై ఉన్న ఆవాసాలను కలిపే రోడ్లు వేసేందుకు బండరాళ్లను బద్ధలుకొడుతూ ముందుకు సాగడం వల్ల ఎక్కువ సమయం పట్టుతోందని, అలాగే నిటారుగా ఉన్న ప్రాంతాలు కావడంతో సాంకేతిక జాగ్రత్తలు తప్పనిసరని చెప్పారు. ప్రస్తుతం వర్షాల ప్రభావంతో పనుల వేగం కొంత తగ్గిందని, అయితే ప్రయత్నాలు ఆగలేదని తెలిపారు.
అటవీ అనుమతుల సమస్య – పరిష్కారం దిశగా
మొత్తం 128 రహదారి మార్గాలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండటంతో అటవీ అనుమతులు అవసరమయ్యాయి. వీటిలో 98 మార్గాలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 186 పనులు ప్రారంభమయ్యాయని, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నాయని, టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతోందని వివరించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డోలీరహిత గిరిజన ఆవాసాల లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం జన్ మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు కేటాయించి సహకరించారని పవన్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగిస్తున్నాం. ఇన్ని వనరులు ఉన్నందున ‘అడవి తల్లి బాట’ పనుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతర పర్యవేక్షణతోనే పనులు వేగంగా పూర్తవుతాయి. సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి. అవసరమైతే అటవీ శాఖతో సమీక్ష జరిపి అనుమతులను త్వరగా పొందాలని పేర్కొన్నారు.
Also Read: Vande Bharat Records: రికార్డులు బద్దలు కొట్టిన వందే భారత్.. ప్రారంభించిన ప్రధాని మోడీ!
స్థానికుల భాగస్వామ్యం అవసరం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ పనుల ప్రాధాన్యతను స్థానికులకు తెలియజేయాలని, తద్వారా వారు కూడా సహకరించేందుకు ముందుకు వస్తారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రహదారి సౌకర్యం లేని ఆవాసాలు తొలిసారి రోడ్డు పొందుతున్నాయి. ఇది కేవలం రోడ్డు కాదు, అభివృద్ధి దారిలో ఒక మలుపు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి వారిలో నమ్మకం, ఉత్సాహం కలిగించాలని ఆయన స్పష్టం చేశారు.
డోలీరహిత ఆవాసాల లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గిరిజన ప్రాంతాల వాణిజ్యం, విద్య, వైద్య సౌకర్యాలు అన్ని వేగవంతం అవుతాయి. అటు పర్యాటకానికి, ఇటు స్థానికుల ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. రవాణా సౌకర్యం లేని కారణంగా ఇప్పటి వరకు పక్కనున్న పట్టణాలకు చేరుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితి, రోడ్లు అందుబాటులోకి రాగానే పూర్తిగా మారిపోతుంది.
రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక నాణ్యత, ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది. ‘అడవి తల్లి బాట’ విజయవంతమైతే, ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారే అవకాశం ఉంది. అభివృద్ధి కాంతి ఇప్పటివరకు తాకని గిరిజన ప్రాంతాల గడప దాటబోతోంది.