Lokesh Vs Botsa: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. మంత్రి లోకేశ్ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని మంత్రి లోకేశ్ అవమానించారని బొత్స ఆరోపించారు. మంత్రి స్థానంలో ఆ వ్యాఖ్యలు సరికాదన్నారు. లోకేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డులను నుంచి తొలగించాలని కోరారు. తల్లిని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని బొత్స హితవు పలికారు.
మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. తాను మాట్లాడినప్పుడు అసలు బొత్స సభలోనే లేరని మంత్రి లోకేశ్ గుర్తు చేశార. మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా? అని బొత్సపై ఫైర్ అయ్యారు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం తాము కాదంటూ వైసీపీ ఎమ్మెల్సీలకు చురకలంటించారు. ఒక తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. తన తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారని లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆనాడు తన తల్లిని నిండు సభలో అవమానించిన వారు ఈ రోజు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ లోకేశ్ విమర్శించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. మహిళలపై కేసులు పెట్టినప్పుడు అప్పుడు మీరేం చేశారంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందిగాక, ఇప్పుడు తమపై విమర్శలు చేస్తుందన్నారు. సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లు బొత్స అవాస్తవాలు చెబుతున్నారన్నారు. బొత్స సీనియార్టీని గౌరవిస్తానని, కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమన్నారు.
Also Read: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు
మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో మహిళలు ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారిని కూడా వదల్లేదన్నారు. అమరావతి రైతులపై పెట్టిన కేసులకు లెక్కలేదన్నారు. తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. తాను ఇప్పటికీ కోర్టుకు వెళ్తున్నానని హోంమంత్రి అనిత చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలను వేధించి ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారని వైసీపీపై అనిత ఫైర్ అయ్యారు.