AP New Passbooks: రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలపై ఎప్పటి నుంచో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అనేకమంది భూములు కలిగి ఉన్నా, పట్టాదారు పాస్‌పుస్తకాల లేమి వల్ల తమ హక్కులను నిరూపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్, భూ హక్కులు, మ్యూటేషన్ లాంటి అంశాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఆగస్ట్ నుంచి కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సర్వే పూర్తయిన భూముల యజమానులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు ఆగస్ట్ లోపు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మొదటివిడతలో 21.86 లక్షల మంది భూమి యజమానులకు పాస్‌పుస్తకాలు ముద్రించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పాస్‌పుస్తకంలో QR కోడ్ ఉండి, ఆధార్ కార్డు ఆధారంగా ఆయా భూములకు సంబంధించిన వివరాలను యజమానులు డిజిటల్‌గా సులభంగా తెలుసుకునే విధంగా సాంకేతికంగా అమర్చనున్నారు. ఇకపై ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి పాస్‌పుస్తకం చేతిలో ఉంటే చాలు.
భూములపై పూర్తి సమాచారం స్క్రీన్ మీదే!
రెవెన్యూ శాఖ ఒక ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూమి లొకేషన్‌ను ఫిజికల్ మ్యాప్ రూపంలో చూడొచ్చు. హద్దులతో పాటు యజమాని వివరాలు, భూమి రకాలు, ప్రభుత్వ భూములు, రిజర్వ్ ఫారెస్టులు, రోడ్లు, చెరువులు, ఆక్రమణలో ఉన్న స్థలాల వివరాలూ కనిపించనున్నాయి. ఇది భూముల కొనుగోలు-అమ్మకాల్లో, భూ వివాదాల పరిష్కారంలో పెద్ద దోహదం చేస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో భూ రిజిస్టేషన్ కోసం ఇది కీలక ఆధారంగా పనిచేస్తుంది.
భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ప్రజల భూ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఏర్పడిన భూ అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై ప్రజల నుంచి వచ్చిన భూ దరఖాస్తులపై ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పరిష్కారం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు.
ఆటోమ్యూటేషన్.. ఇక వెయిటింగ్ అవసరం లేదు
భూముల పేరుమార్పులు (మ్యూటేషన్) విషయంలో ఇప్పటికే ఆటోమేటిక్ మ్యూటేషన్ పద్ధతిలో 1.93 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు, అందులో 1.77 లక్షలు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. ఇకపై ఇంకా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, స్వల్ప సమయంలోనే భూమి పేరు మార్చే విధానాన్ని ప్రభుత్వం మరింత వేగవంతం చేయనుంది.
Also Read: 15 Carat Diamond Kurnool: కర్నూలులో దొరికిన భారీ వజ్రం.. లక్ అంటే ఈమెదే!
డిసెంబర్‌లోపు రెగ్యులరైజేషన్
ప్రజలు రెగ్యులర్‌గా నివసిస్తున్న అభ్యంతరంలేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ లోపు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం తెలిపారు. దీనివల్ల చట్టబద్ధత లేని స్థలాల్లో నివసిస్తున్నవారికి స్థిరత్వం కలుగుతుంది.
కొత్త రెవెన్యూ మాన్యువల్.. పాలసీ మార్గదర్శి
ప్రస్తుత పాలన విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వం ఒక కొత్త రెవెన్యూ మాన్యువల్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. కొత్త జీవోలను, పాలసీలను ఈ మాన్యువల్‌లో పొందుపరచి, రెవెన్యూ శాఖ అధికారులకు క్లారిటీతో కూడిన మార్గదర్శకంగా ఉపయోగపడేలా చేయాలని సీఎం అన్నారు.
భూమి మీద హక్కును నిరూపించుకోవడం ఓ సాధారణ పౌరుడికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఆ హక్కును సాధికారంగా చాటుకునే పాస్‌పుస్తకం ఇక ఆగస్ట్ నుంచే అందుబాటులోకి రాబోతోంది. భూ సమస్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లో భూ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే అవకాశం ఉంది. మరి ఈ మార్పులు ఎంత త్వరగా అమలవుతాయో చూడాలి!