Thug Life out on OTT : కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించాడు. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 1987లో విడుదలైన ఐకానిక్ చిత్రం ‘నాయకన్’ అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. దాదాపు 38 సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరి కాంబో మళ్ళీ రిపీట్ అయింది. ఈ మూవీ థియేటల్లో విడుదలైన నెలలోపే, సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న డేట్ కి ముందుగానే, ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. దీని వల్ల డిస్ట్రబ్యూటర్స్ కి నష్టాలు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా, ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ కావడంతో, రిలీజ్ కు ముందు నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న 135 కోట్ల డీల్ ను భారీగా తగ్గించి నట్లు సమాచారం. దాదాపు పాతిక కోట్లను తగ్గించి, 110 కోట్లతో మళ్ళీ డీల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పేరు, స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ పేరు ‘తగ్ లైఫ్’ (Thug Life). మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ తమిళ సినిమా 2025 జూన్ 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో త్రిషా కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాజర్, ఆషోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి వంటి నటులు నటించారు. ఈ సినిమా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌ల కింద నిర్మించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌తో ఇది రూపొందింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 2025 జూలై 3న ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1994లో ఓల్డ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ గ్యాంగ్ లీడర్ రంగరాయ సక్తివేల్ నాయకర్ (కమల్ హాసన్) అతని అన్నయ్య రంగరాయ ‘మణికం’ మణికవేల్ (నాజర్) తమ ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ సదానంద్ యాదవ్ తో సంధికి చర్చలు జరుపుతారు. అయితే సదానంద్ ఈ సంధిని ఒక కుట్రలో భాగం చేస్తాడు. అతను ఢిల్లీ పోలీసులతో కలిసి ఒక షూటౌట్‌ను రూపొందిస్తాడు. ఈ కాల్పుల్లో మణికం అనుకోకుండా ఒక న్యూస్‌పేపర్ డెలివరీ చేసే వ్యక్తిని చంపేస్తాడు. దీని ఫలితంగా అతని ఇద్దరు పిల్లలు అమరన్, చంద్ర అనాధలవుతారు. సక్తివేల్ పశ్చాత్తాపంతో, అమరన్‌ను దత్తత తీసుకుని తన కుటుంబంలో మనిషిగా పెంచుతాడు. మరో వైపు చంద్ర ఏమవుతాడో తెలీకుండా పోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, సక్తివేల్ ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా, ఢిల్లీలో తన అక్రమ సామ్రాజ్యాన్ని నడుపుతాడు. తనను యముడితో పోల్చుకుంటూ, తనకు మరణం లేదని చెప్పుకుంటాడు. అమరన్‌ను తన కొడుకుగా పెంచిన సక్తివేల్, అతనితో ఒక బలమైన బంధాన్ని పెంచుకుంటాడు.
అమరన్ ఒక బార్ డాన్సర్ అయిన జీవాతో ప్రేమలో పడతాడు. ఆమెను వివాహం కూడా చేసుకుంటాడు. అయితే ఒక రోజు సక్తివేల్‌పై ఒక హత్యాయత్నం జరుగుతుంది. దీనికి మణికం స్కెచ్ వేస్తాడు. సక్తివేల్ కు అమరన్‌పై అనుమానం వస్తుంది. మణికం, అమరన్‌ను సక్తివేల్‌కు వ్యతిరేకంగా తప్పుదారి పట్టిస్తాడు. అమరన్ తండ్రిని సక్తివేల్ చంపాడని నమ్మేలా చేస్తాడు. ఈ క్రమంలో అమరన్. సక్తివేల్‌ను ఒక ఎత్తైన ప్రదేశం నుండి తోసేస్తాడు. సక్తివేల్‌ను చనిపోయాడని అమరన్ భావిస్తాడు. సక్తివేల్ ను ఈ ప్రమాదం నుంచి టిబెటన్ గ్రామస్తులు కాపాడతారు. అతను రెండు సంవత్సరాల తర్వాత ప్రతీకారం కోసం తిరిగి మళ్ళీ వస్తాడు. ఈ సమయంలో అతను డాక్టర్ చంద్రను కలుస్తాడు. అతను అమరన్ సోదరుడని తెలుస్తుంది. ఇక సక్తివేల్, అమరన్, చంద్ర తిరిగి కలుసుకునే సమయంలో, ఈ స్టోరీ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి సక్తివేల్ తన రివేంజ్ ను తీర్చుకుంటాడా ? అమరన్, తన సోదరుడు చంద్రను తిరిగి కలుస్తాడా ? మణికం పరిస్థితి ఏమవుతుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పడుకున్న శవాన్ని లేపి మరీ తన్నించుకునే ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హారర్ మూవీ