Pension Scheme: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, పాలనలో ‘సామాజిక పెన్షన్’ అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు.. అది కోట్ల మంది పేదల జీవితాల్లో ఒక భరోసా. ఈ సంక్షేమ విప్లవానికి నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎలా పునాది వేశారు, కాలక్రమేణా అది ఎలా రూపాంతరం చెందుతూ నేటి కూటమి ప్రభుత్వంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోందో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ సమగ్ర వివరాలతో వివరించారు.
ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ విప్లవం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పేదలు, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను గుర్తించి, వారికి సామాజిక పెన్షన్ ద్వారా ఒక అండను, గౌరవాన్ని కల్పించిన వ్యక్తి అన్న నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్ అధికారంలోకి రాకముందు వరకు సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు గానీ, దివ్యాంగులకు గానీ ఎలాంటి ఆసరా ఉండేది కాదు. బడుగు, బలహీన వర్గాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలనే గొప్ప సంకల్పంతో ఆయన 1983లో కేవలం రూ. 35 లతో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనాడు ఆయన వేసిన ఆ చిన్న అడుగే, నేడు రాష్ట్రంలో ఒక మహావృక్షమై లక్షలాది కుటుంబాలను ఆదుకుంటోంది.
Also Read: ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, వైసీపీ
1983 నుంచి నేటి వరకు ప్రతి పేదవాడి ఇంటికి పెన్షన్ చేరడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలిచింది. 1994-2004 మధ్య కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఈ పెన్షన్‌ను రూ. 75 లకు పెంచి లబ్ధిదారులకు తోడుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని కేవలం రూ. 125 లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే, 2014 లో చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే ఆ పెన్షన్‌ను ఏకంగా రూ. 125 ల నుంచి రూ. 2,000 లకు పెంచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతి కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రూ. 2 వేల పెన్షన్‌ను ఒకేసారి రూ. 3 వేలు చేస్తానని మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ. 250 చొప్పున పెంచుకుంటూ యూ-టర్న్ తీసుకున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వంలో చారిత్రాత్మక మార్పులు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 3,000 ఉన్న పెన్షన్‌ను రూ. 4,000 కు పెంచింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ నెల నుంచే వర్తింపజేస్తూ, జూలై నెలలో బకాయిలతో కలిపి ప్రతి లబ్ధిదారునికి రూ. 7,000 చొప్పున అందజేసి తమ నిజాయితీని చాటుకుంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, గత రెండేళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 66,000 కోట్లను కేవలం పింఛన్ల పంపిణీ కోసమే ఖర్చు చేయడం విశేషం.
దేశంలోనే అగ్రస్థానం.. పెరిగిన సాయం
ప్రస్తుత ప్రభుత్వం కేవలం వృద్ధులకే కాకుండా, సమాజంలో మరింత అండ అవసరమైన వర్గాలకు భారీగా లబ్ధి చేకూరుస్తోంది. ఇందులో భాగంగా.. దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 3,000 నుండి రూ. 6,000 లకు పెంచారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10,000 అందిస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన రోగులకు రూ. 15,000 సహాయం అందిస్తున్నారు.
ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందుతోంది. ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే, అంతకంటే ముందు రోజైన 31వ తేదీనే పెన్షన్ ఇచ్చేలా మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, అత్యధిక మొత్తంలో సామాజిక పింఛన్లు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.