హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టింది తానేనంటూ చంద్రబాబు చెబితే సోషల్ మీడియాలో వెటకారాలాడే బ్యాచ్ రెడీగా ఉంటుంది కానీ.. ఆ పేరు చెబితే చంద్రబాబు మినహా ఇంకెవరూ గుర్తుకు రారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ల్యాండ్ మార్క్ ఒకటి రాబోతోంది. అదే క్వాంటమ్ వ్యాలీ. ఇప్పటికిప్పుడు ఇది అసాధ్యం అంటూ విమర్శలు వినిపిస్తున్నా.. సుసాధ్యం చేయడానికి చంద్రబాబు ఆల్రడీ గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. హైదరాబాద్ కి హైటెక్ సిటీ ఎలాగో, అమరావతికి క్యాంటమ్ వ్యాలీ అలా అని గర్వంగా చెప్పుకునేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూటమి నేతలు చెబుతున్న మాట కాదు, నార్వే రాజకీయ వేత్త, మాజీ మంత్రి, ప్రస్తుతం పర్యావరణ వేత్తగా మారిన ఎరిక్ సొలీం చెబుతున్న మాటలివి. చంద్రబాబు ఆధ్వర్యంలో క్వాంటమ్ వ్యాలీ తన ఉనికి చాటుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.
ఎవరీ సొలీం..?
ఎరిక్ సొలీం నార్వేకి చెందిన రాజకీయ వేత్త, వివిధ కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు, ఐక్యరాజ్య సమితిలో కూడా కొన్నాళ్లు పనిచేశారు. పర్యావరణ విషయాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. గతేడాది ఆయన గుజరాత్ లో జరుగుతున్న రీ ఇన్వెస్ట్ ఫోరమ్ లో పాల్గొన్నారు. అక్కడ చంద్రబాబుని కలసిన ఎరిక్ సొలీం.. ఆయన విజన్ గురించి ఆసక్తికర ట్వీట్ వేశారు. బారత్ లోని ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని, గ్లోబల్ ఐటీనాయకులతో కలిసి ఆయన పని చేశారని, హైదరాబాద్‌ను భారతదేశంలోనే అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా మార్చారని చెప్పుకొచ్చారు. పర్యావరణ హిత ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ని తమ డెస్టినేషన్ గా చూస్తున్నాయని, ఆ దిశగా తాము కూడా ఏపీతో కలసి పనిచేస్తామని అన్నారాయన.
Meeting the iconic Indian 🇮🇳 Chief Minister.
It was wonderful to touch base with Nara Chandrababu Naidu
here at the RE Invest forum in Gujarat. Naidu was just elected back as Chief Minister of Andhra Pradesh and I am sure he weill take his state to new heights.Few Indian… pic.twitter.com/cpIcXFjPNg
— Erik Solheim (@ErikSolheim) September 17, 2024
క్వాంటమ్ వ్యాలీపై తాజా ట్వీట్..
తాజాగా క్వాంటమ్ వ్యాలీపై ఎరిక్ సొలీం మరో ట్వీట్ వేశారు. హైదరాబాద్ ని శక్తిమంతమైన ఐటీ రాజధానిగా మార్చిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని భారత దేశపు క్వాంటమ్ వ్యాలీగా మార్చబోతున్నారని చెప్పారు. ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారని, ఇది భారత్ లోనే అతిపెద్ద టెక్ కేంద్రాలకు పోటీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో హైటెక్ సిటీకోసం ఎలా కష్టపడ్డారో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకోసం కూడా ఆయన అలాగే కష్టపడుతున్నారని, అయితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, తన పలుకుబడి ఉపయోగించి ఏపీని క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ గా మారుస్తున్నారని చెప్పారు. తన ట్వీట్ లో ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని కూడా జోడించారు.
This is amazing! Andhra Pradesh 🇮🇳 will develop Indias “quantum valley”.
Chandrababu Naidu is back as the Chief Minister of Andhra. Everyone can feel the difference. It brings this southern Indian state center stage.
Naidu was the man behind the development of Hyderabad. He… pic.twitter.com/ViO5cA81oa
— Erik Solheim (@ErikSolheim) August 1, 2025
క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేకతలు..
ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టీ), ఐబీఎంలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం- 2ను ఐబీఎం ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ తో పాటు రీసెర్చ్, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించడానికి ముందుకొచ్చింది. క్లయింట్ నెట్వర్క్ తో పాటు స్టార్టప్, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్అండ్టీ సంస్థ అందిస్తుందని అంటున్నారు. 2026 జనవరి 1 నాటికి ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ రెడీ అవుతుందనే అంచనాలున్నాయి. 1998లో మైక్రోసాఫ్ట్ కి చెందిన తొలి విదేశీ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కృషి చేశారని, దాని ఫలితమే నేడు ఐటీలో హైదరాబాద్ ప్రగతి అని అంతర్జాతీయ మీడియా హైలైట్ చేయడం విశేషం. ఇప్పటికే విశాఖకు పలు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు వచ్చాయని, ఇప్పుడు అమరావతిలో కూడా అలాంటి అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏపీకి ల్యాండ్ మార్క్ అవుతుందని, హైదరాబాద్ ఐటీ రాజధాని అయినట్టుగానే, అమరావతి క్వాంటమ్ హబ్ గా మారుతుందని చెబుతున్నారు.