CM Chandrababu Progress Report: రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరుగులు పెట్టించేలా.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీపై.. ఏపీ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా టెక్నాలజీతో ప్రజలకు సేవల్ని మరింత దగ్గర చేసే అంశంపై.. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో సీఎం రివ్యూ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మకు జలహారతినిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. మొత్తంగా.. ఆంధ్రప్రదేశ్‌ని పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు.
జులై 7, సోమవారం ( జీరో క్రైమ్ రేట్ టార్గెట్ )
సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై.. అధికారులతో రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టెక్నాలజీని వినియోగించుకొని.. జీరో క్రైమ్ రేట్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో.. ఏపీని ఓ మోడల్ స్టేట్‌గా మార్చాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాలను నియంత్రించాలని ఆదేశించారు.
జులై 8, మంగళవారం ( కృష్ణవేణికి జలహారతి )
నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం.. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు.. ముఖ్యమంత్రికి ఆశీర్వచనం చేశారు. తర్వాత.. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు చంద్రబాబు. వేదపండితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపి.. కృష్ణమ్మకు సారె సమర్పించారు ముఖ్యమంత్రి. తర్వాత.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
జులై తొలివారంలోనే శ్రీశైలం డ్యామ్ నిండటం శుభపరిణామమని చెప్పారు సీఎం చంద్రబాబు. శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందన్నారు. నీటితోనే రైతుల కష్టాలు తీరతాయని.. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పారు. ప్రాజెక్టులకు 68 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు చంద్రబాబు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ నెలాఖరుకల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు వస్తాయని చెప్పారు సీఎం. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని.. అప్పుడే రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందన్నారు చంద్రబాబు.
జులై 8, మంగళవారం ( అమరావతి అన్‌స్టాపబుల్ )
రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో 72 సంస్థలకు 947 ఎకరాలను సీఆర్డీయే కేటాయించింది. వీటిలో విద్యాసంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ, టెక్ పార్కులున్నాయి. వీటిలో 3 సంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. 15 సంస్థలు రెండు నెలల్లో, 13 సంస్థలు 5 నెలల్లో, 17 సంస్థలు 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి. అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండొద్దని.. సీఎం హామీ ఇచ్చారు.
జులై 9, బుధవారం ( కీ డెసిషన్స్ )
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుతో పాటు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదముద్ర వేశారు. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ అంగీకరించింది. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. కుళాయి నీరు
అందించేందుకు 10 వేల కోట్ల రుణాల సమీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సర్కార్ భావిస్తోంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వైసీపీ హయాంలో పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ని.. 3 వేల వరకు తగ్గించారు. ఇక.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిల డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించారు. ధాన్యం పాత బకాయిలు వెయ్యి కోట్లు ఉండగా.. అందులో 672 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
జులై 9, బుధవారం ( టెక్నాలజీకి పెద్ద పీట )
రాష్ట్రంలో వివిధ రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని.. ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఇన్ఫ్రా, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్-2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ లాంటి అంశాల్లో.. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం నిర్వహించిన రివ్యూలో.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. జనాభా నియంత్రణ కాదు నిర్వహణ అవసరమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలని ఆకాంక్షించారు సీఎం. సంస్కరణలతో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని.. సీఎం స్పష్టం చేశారు. ఇక.. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌తో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
జులై 10, గురువారం ( మెగా మీట్ )
సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందిన తల్లులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. ఒకే రోజు.. రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, టీచర్లతో.. పేరెంట్స్, టీచర్స్‌తో మెగా మీటింగ్‌ని నిర్వహించింది ప్రభుత్వం. గురు పూర్ణిమని పురస్కరించుకొని.. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు పూర్వ విద్యార్థులందరినీ.. ఒక చోటుకు చేర్చింది. మెగా పేరెంట్స్ మీటింగ్‌తో.. ఏపీ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. కొత్తచెరువు హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. విద్యార్థులతో ముచ్చటించడమే కాదు.. టీచర్ అవతారమెత్తి పాఠాలు బోధించారు. మంత్రి నారా లోకేశ్ కూడా విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. స్టూడెంట్స్.. ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన సీఎం.. మార్కులకు ఆరా తీశారు. తల్లిదండ్రులతో మాట్లాడి.. స్కూల్‌లో విద్యా బోధన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి.. చంద్రబాబు మధ్యాహ్న భోజనం చేశారు.
చదువుకొని పైకొచ్చిన వారు.. ప్రభుత్వ స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఎవరినైనా మర్చిపోతాం కానీ.. టీచర్లను మరిచిపోలేమన్నారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలన్నారు. మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువేమీ కాదన్నారు సీఎం. అందుకోసమే.. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్ని తీర్చిదిద్దుతున్నామన్నారు.
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో.. శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
జులై 11, శుక్రవారం ( జీఎస్టీలో రోల్ మోడల్ )
సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని.. సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లలో.. ఆంధ్రప్రదేశ్.. దేశానికి రోల్ మోడల్‌గా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా.. పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన కేంద్ర-రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. డేటా అనలటిక్స్ లాంటి టెక్నాలజీని వినియోగించి.. పన్ను ఎగవేతల్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని సీఎం సూచించారు.
జులై 11, శుక్రవారం ( గవర్నర్‌తో సీఎం )
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను గవర్నర్‌కు వివరించారు. అదేవిధంగా.. ఏడాది పాలనా కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు సహా వివిధ అంశాలను.. గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది.
జులై 11, శుక్రవారం ( దేశమంటే మనుషులోయ్! )
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన తొలి సదస్సులో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదల తగ్గడంపై.. సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తానే జనాభా నియంత్రణ గురించి మాట్లాడానన్న చంద్రబాబు.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గురి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారే నిజమైన దేశభక్తులన్నారు. వారే.. సమాజాన్ని కాపాడే వ్యక్తులని.. అలాంటి వారిని గౌరవిద్దామని చెప్పారు. జనాభా పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిపారు.
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. జనాభా అనేది ఆస్తిగా మారిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు అధిక జనాభా ఉన్న దేశాలను చులకనగా చూసే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు జనాభా భారం కాదని.. ఆస్తి అని అన్నారు. గురజాడ చెప్పినట్లుగా.. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని గతంలో చట్టం తెచ్చామని.. ఇప్పుడు ఆ చట్టానికి మార్పులు చేసినట్లు గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటేనే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందన్నారు.
Also Read: జగన్ పర్యటన పోలీసులు చేతులెత్తేశారా?
ఏపీ జనాభా వచ్చే ఏడాది నాటికి 5 కోట్ల 38 లక్షలకు చేరుకుంటే.. 2051 నాటికి.. 5 కోట్ల 41 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా పెరుగుదల లేకపోతే.. యువత సంఖ్య తగ్గిపోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే.. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని కనాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అందువల్ల.. జనాభా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Story By Anup, Bigtv