Student Sneha: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి స్నేహా దేబ్‌నాథ్‌ది హత్యా? ఆత్మహత్యా? సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర లభించిన లెటర్‌లో ఏయే విషయాలు బయటపడ్డాయి? మానసిక ఒత్తిడి ఆత్మహత్య చేసుకుందా? పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి నిజాలు బయటకురానున్నాయి? ఇవే ప్రశ్నలు స్నేహ కుటుంబసభ్యులు, ఆమె స్నేహితులను వెంటాడుతున్నాయి.
ఆరు రోజుల కిందట అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి స్నేహా దేబ్‌నాథ్ యమునా నది ఒడ్డున విగత జీవిగా కనిపించింది. ఈనెల ఏడున ఢిల్లీలో పర్యవరణ్ కాంప్లెక్స్‌లో తన ఇంటి నుండి రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. ఉదయం 5 గంటల సమయంలో బయలుదేరిన స్నేహా.. ఫ్రెండ్‌ని రోహిల్లా రైల్వేస్టేషన్‌లో దింపడానికి వెళ్తున్నానని తల్లికి చెప్పింది.
దాదాపు ఆరు గంటల సమయంలో స్నేహాతో ఆమె తల్లి మాట్లాడింది. మళ్లీ ఉదయం 8.45 గంటలకు కాల్ చేసినప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. స్నేహా తన ఫ్రెండ్స్‌ని కలవలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించగా స్నేహను ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద దించినట్టు చెప్పాడు. స్నేహ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.
చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం సాయంత్రం యమునానది ఒడ్డున విగత జీవిగా కనిపించింది. సీసీటీవీ కెమెరా ద్వారా సిగ్నేచర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఆ వంతెన పరిసర ప్రాంతాల్లో స్నేహ చేతితో రాసిన ఓ నోట్ కనిపించింది. సిగ్నేచర్ బ్రిడ్జి పైనుంచి దూకినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఆమె ఉన్నట్టు స్నేహితులు చెబుతున్నారు.
ALSO READ: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి సీరియస్
ఈనెల ఏడున ఉదయం ఓ అమ్మాయి బ్రిడ్జిపై నిలబడి ఉన్నట్లు చూశామని అంటున్నారు ప్రత్యక్షసాక్షులు. ఆ తర్వాత ఆమె అదృశ్యమైందని అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బయటకురానున్నాయి. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
త్రిపురకు చెందిన స్నేహా దేబ్‌నాథ్ అనేక కలలతో రాజధాని ఢిల్లీకి మకాం మార్చింది. తన డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు కృషి చేస్తోంది. ఆమె లింక్డ్ఇన్ ద్వారా వివరాల మేరకు.. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలలో మేథ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చేస్తోంది.
ఇంకోవైపు ఐఐటీ మద్రాస్‌లో డేటా సైన్స్-ప్రోగ్రామింగ్‌లో కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ సంస్థలో పార్టుటైమ్ వర్క్ చేస్తోంది. ఆమె కజిన్ మరోలా చెబుతోంది. పని చేస్తూ ఒకేసారి రెండు డిగ్రీలు చదువుతోందని, ఎవరి నుంచి డబ్బు ఆశించలేదని అంటోంది.