
Viveka Murder Case News(AP Updates) : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. సీబీఐ అధికారులు తాజా మరోసారి పులివెందులలోని వివేకా ఇంటికి వెళ్లారు. వివేకా హత్య జరిగిన బాత్రూమ్,బెడ్ రూమ్ ను పరిశీలించారు. ఆ తర్వాత సీబీఐ అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించారు. అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు.
ఇటీవల ఐదోసారి విచారణకు అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చిన సీబీఐ వరుసగా మూడో రోజులు ప్రశ్నించింది. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా సీబీఐ దృష్టి పెట్టింది. హత్య జరిగిన రోజు జమ్మలమడుగు వెళ్తుండగా తనకు ఫోన్ వస్తే తిరిగి వచ్చానని అవినాష్‌రెడ్డి విచారణ సమయంలో తెలిపారు. ఆయన చెప్పిన విషయాలపై సీబీఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవినాష్ పీఏను పులివెందుల రింగ్ రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. ఎంత సమయంలో వివేకా ఇంటికి అవినాష్ వచ్చారన్న అంశంపై సీబీఐ సమాచారం సేకరించింది. హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చు అనేదానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించింది.
తిరిగి మళ్లీ వివేకా ఇంటికి వచ్చి ఘటన జరిగిన ప్రదేశాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే సమాచారం తెలుసుకున్నారు. ఘటన జరిగిన రోజు వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లా కుటుంబ సభ్యులకు పంపారు.
మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు సవాల్ చేశారు. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టును సునీతారెడ్డి ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సోమవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ మళ్లీ విచారణకు రానుంది. ఏప్రిల్ 30లోపు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు లోపు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.