⦿ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో నాప్రమేయం లేదు
⦿ అర్ధరాత్రి ఒత్తిడి చేయడం నచ్చలేదు, డౌట్ వచ్చింది
⦿ ఏదో మతలబు ఉందనే నేను సంతకాలు చేయలేదు
⦿ వైఎస్ కేబినెట్‌లో స్వేచ్ఛ ఉండేది, జగన్ హయాంలో లేదు
⦿ మంత్రిగా ఎందుకు పనిచేశానా? అని బాధపడుతున్నా
⦿ వైఎస్ జగన్ రెడ్డి పాత్ర నిజమే అయితే క్షమించరానిదే
⦿ మొత్తం పెద్ద మంత్రే చేశారని ఓపెన్ అయిన మాజీ మంత్రి
⦿ అదానీ ముడుపుల కేసు నేపథ్యంలో బాలినేని కీలక వ్యాఖ్యలు
అమరావతి, స్వేచ్ఛ:
అదానీ ముడపుల వ్యవహారం నేపథ్యంలో, వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి బాంబ్ పేల్చారు. సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండా జరిగిపోయిందని, ఎలాంటి సంతకాలు చేయలేదని తేల్చి చెప్పేశారు. ‘ అర్ధరాత్రి ఒకటికి నాలుగుసార్లు సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. ఇదంతా నాకు నచ్చలేదు. ఏదో మతలు ఉందనే అనుమానం వచ్చింది. అందుకే నేను ఎలాంటి సంతకాలు చేయలేదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతాం? అని నా పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికే శ్రీకాంత్ నా అదనపు పీఎస్‌కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారు. శ్రీకాంత్ చెప్పినట్లే ఉదయమే కేబినెట్ ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లాను. మంత్రిమండలి సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారు. నేను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని, అంతా పెద్ద మంత్రి నడిపించారు. అలా నా నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయింది. ఇలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెబుతారు? అడపాదడపా శ్రీకాంత్ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారు. అంతేకానీ పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదు. యూనిట్ ధర రూ.2.49కి ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం వెలుగు చూసే వరకు కూడా అవినీతి జరిగిందనే విషయం నాకు తెలియదు. ఈ ఈ వ్యవహారంపై అప్పట్లో ఏం జరిగిందో జగన్‌కు సుదీర్ఘంగా వివరించాను.
బాధగా ఉంది..
వైఎస్ మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ఉండేది. కానీ, వైఎస్ జగన్ కేబినెట్‌లో స్వేచ్ఛ లేనే లేదు. నాడు మంత్రిగా నిర్ణయం తీసుకొని వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పేవాళ్లం. కానీ జగన్ మంత్రివర్గంలో ఆ వాతావరణం లేదు. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు జగన్‌కు చెప్పేవాడిని. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్ దృష్టికి తీసుకెళ్లడం ఆయనకు నచ్చలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలే చెబుతారా? అని అనేవారు. విద్యుత్ శాఖలో ఏం జరుగుతోంది? అని సంబంధిత శాఖ మంత్రిగా సీఎండీలకు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించేవారు కాదు. వారంతా కాంట్రాక్టర్ చేతిలో ఉండేవారు. మంత్రిగా నేను కాంట్రాక్టర్ చేతిలో ఉండాలా? అని సీఎంవోలో అడిగాను. అన్నీ నిలదీసి అడిగినందుకే నన్ను మంత్రి పదవి నుంచి తప్పించారని అనుకుంటున్నాను. ఉన్న ఫలంగా మంత్రిపదవి నుంచి తొలగించడం నాకు బాధేసింది. మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. వైఎస్ కుటంబ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకునే వాడిని కాదు. అమెరికా కేసులో వైఎస్ జగన్ పాత్ర నిజమే అయితే క్షమించరానిది. ఇలాంటివన్నీ చూస్తుంటే జగన్ వద్ద విద్యుత్ మంత్రిగా ఎందుకు పనిచేశానా? అని బాధపడుతున్నాను’ బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు.
ఆ ఇద్దరూ ఒక్కటేనా?
అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారంలో 2019-2024 వరకూ ఉన్న ‘హయ్యర్ అఫీషియల్’ అని దర్యాప్తు సంస్థ పదే పదే పేర్కొన్నది. ఇంతకీ ఆ హయ్యర్ ఎవరనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బాలినేని పెదవి విప్పారు. సంబంధిత మంత్రి ప్రమేయం లేకుండానే ఒప్పందం జరగడమేంటి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. వాస్తవానికి ఒప్పందానికి ముందు పెద్ద చర్చ, కసరత్తు జరగాలి. అసలు ఇది లాభమా? నష్టమా? అనేది బేరీజు వేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి ధరలపై లోతుగా అధ్యయనం చేయాలి, నిపుణులతోనూ చర్చించాల్సి ఉంటుంది. బాలినేని చెప్పిన మాటలను బట్టి చూస్తే కసరత్తు కాదు కదా కనీసం చర్చ కూడా జరగలేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కోసం, జగన్ వల్ల, జగన్ చేత అన్నట్లుగా అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయని తేటతెల్లమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక ‘పెద్ద మంత్రి’ అన్నీ తానై వ్యవహరించారని బాలినేని బాంబ్ పేల్చడం గమనార్హం. దీంతో అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతున్నట్లుగా ఆ ‘హయ్యర్ అఫిషియల్’, బాలినేని శ్రీనివాస్ చెబుతున్న ‘పెద్ద మంత్రి’ ఇద్దరూ ఒక్కటేనా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. చివరికి ఏం తేలుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.