Pm Modi: మహారాష్ట్ర విజయంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటూ నడ్డా రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని, అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Also read: జార్ఖండ్‌ను నిలుపుకున్న ఇండియా కూటమి.. 81కి 55 స్థానాల్లో విజయబావుటా
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరిందని చెప్పారు. 50 ఏళ్ల తరవాత ఇది అతిపెద్ద విజయం అని అన్నారు. కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసిందని, రెండు రాజ్యాంగాలు ఉండాలన్న.. కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు.
సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలుచేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని మోడీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పరాన్నజీవిగా మారిందని, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాతా ఖాళీ అయిందని అన్నారు. కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలు విఫలమయ్యాయని చెప్పారు. రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి స్థానమే లేదని, ఓట్ల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టం తెచ్చిందని విమర్శించారు.