Big Stories

Balineni: గోనె అన్నారు.. బాలినేని ఏడ్చారు.. ఏమన్నారు? ఎందుకేడ్చారు? తెలియాల్సిందే..

Balineni: బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా మారబోతున్నారు. ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ పిలింపుకుని మాట్లాడినా దారికి రాలేదు. బాలినేని పార్టీని వీడుతున్నారని.. టీడీపీ, జనసేనలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తనపై సజ్జల, వైవీ సుబ్బారెడ్డిలే కుట్ర చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. జిల్లాలో తనను ఏకాకిని చేస్తున్నారని.. తన పలుకుబడిని తగ్గిస్తున్నారని.. కనీసం ఓ డీఎస్పీని కూడా వేయించుకోలేకపోతున్నానని.. ఇలా చాలా కారణాలే చెబుతున్నారు. అన్నీ విన్నాక కూడా.. జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో మౌనంగానే ఉండిపోయారు. కానీ, ఆయన్ను మళ్లీ మళ్లీ గిల్లుతుండటంతో ఈసారి ఉగ్గబట్టుకోలేక మీడియా ముందుకు వచ్చారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కెమెరాల సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలినేని అంతటి బలమైన నేత.. అలా కన్నీటిపర్యంతం కావడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయనకు అంతలా ఏడిపించింది ఎవరు? ఆ కన్నీటికి కారణం ఏంటి?

- Advertisement -

మాజీ మంత్రి గోనె ప్రకాశ్‌రావు. తెలంగాణ నేత. వైఎస్సార్‌కు నమ్మినబంటు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు. ఫోటో చూస్తే కానీ గుర్తుపట్టరు చాలామంది. అలాంటి ఆఫ్‌లైన్ నాయకుడు.. ఆయనకు ఎలాంటి సంబంధంలేని బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ఘాటు విమర్శలు చేశారు. బాలినేనికి వందల కోట్లు ఎలా వచ్చాయని.. ఆయన శ్రీలంకలో గ్యాంబ్లింగ్ ఆడారని.. ప్రైవేట్ లగ్జరీ చాపర్‌లో విదేశాలకు వెళ్లారని.. మద్రాస్ వెళ్తుంటే పట్టుబడ్డారని.. వైజాగ్‌లో ల్యాండ్ డీల్ చేశారని.. ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని.. ఇలా బాలినేని చరిత్రంతా తవ్విపోశారు గోనె ప్రకాశ్‌రావు అనే మాజీ కాంగ్రెస్ నేత. వైవీ సుబ్బారెడ్డి పెట్టిన భిక్ష వల్లే బాలినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారని.. అలాంటి వైవీ గురించి ఇప్పుడు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని.. మరింత దెప్పిపొడిచారు గోనె.

- Advertisement -

ఇన్నాళ్లూ ఎవరేమన్నా బయటపడని బాలినేని.. గోనె మాటలతో బాగా హర్ట్ అయ్యారు. తన గురుంచి గోనె అలా మాట్లాడటం వెనుక తన వ్యతిరేకుల హస్తం ఉందంటూ పరోక్షంగా వైవీ సుబ్బారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని.. తనపై నిందలు ఆరోపణలు భరించలేకపోతున్నానని.. బాగా ఎమోషనల్ అయ్యారు. మీడియా లైవ్‌లోనే కంటతడి పెట్టారు.

గోనె ప్రకాశ్‌రావుకి వైవీ సుబ్బారెడ్డి దేవుడిగా కనిపిస్తే అభ్యంతరం లేదు కానీ.. తన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటని బాలినేని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసంటూ విమర్శలు గుప్పించారు. బాలినేని టార్గెట్ వైవీ, సజ్జలనే అంటున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని.. వారి పేర్లు చెప్పి పార్టీని రోడ్డున పడవేయలేనని చెప్పారు. తాను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకున్నారని.. వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని.. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని బాలినేని అన్నారు. తాను టికెట్‌ ఇప్పించిన వారే.. తనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శకులకు సిగ్గు లేదు.. అలాంటి నీచులకు పార్టీపై ప్రేమలేదు.. తన వ్యతిరేకుల మాదిరిగా తాను పార్టీకి నష్టం చేయలేదు.. వారిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటే మంచిదని ఫైర్ అయ్యారు. ఈ వివాదాలకు అధిష్ఠానమే ముగింపు పలకాలన్నారు శ్రీనివాసరెడ్డి. మూడు జిల్లాల్లో గడపగడపకు తిరగలేకనే.. పార్టీ కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేశానని సెలవిచ్చారు.

టీడీపీ, జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని బాలినేని స్పష్టం చేశారు. తాను చివరి వరకు వైఎస్ కుటుంబంతో ఉంటానని తేల్చి చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News