Srisailam Karthika Masam: శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి వచ్చే నెల 21 వరకు.. కార్తీక మాసోత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా లక్షలాది మంది భక్తులు.. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.. అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. భక్తుల సౌకర్యం, భద్రత, వసతి, పలు అంశాలపై ఆయన విస్తృత చర్చ జరిపారు.
కార్తీక మాసం తొలి రోజున అష్టోత్తర శతనామార్చన, రుద్రాభిషేకం, కార్తీక దీపోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని. ప్రతి రోజూ సాయంత్రం శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారికి దీపారాధన, వ్రతాలు, హారతులు నిర్వహిస్తారని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ క్యూలైన్‌లు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా.. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసు శాఖతో సమన్వయం కలిగి వాహనాల పార్కింగ్ జోన్లను గుర్తించారని ఈవో వివరించారు. శ్రీశైలం ఘాట్ రోడ్ల వద్ద వాహనాల చెకింగ్ పాయింట్లు, తాత్కాలిక పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ కట్టుదిట్టంగా నియంత్రించేందుకు రవాణా శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించనున్నట్లు చెప్పారు.
కార్తీక మాసంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భక్తులుఅధికారుల సూచనలను అనుసరించాలని కోరుతున్నాం అన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు.
Also Read: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ప్రత్యేక పూజలు, హారతులు, దీపోత్సవాలు నిర్వహించబడతాయి. ఘాట్‌లు, ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలతో మార్మోగుతాయి. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపించనున్నట్లు అధికారులు తెలిపారు.