BigTV Exclusive – Vamsi: నేను ఎలా కనిపిస్తున్నా.. డల్ గా ఉన్నానా? బ్రహ్మాండంగా ఉన్నా అంటూ బిగ్ టీవీతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చెప్పిన మాటలివి. వంశీని పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన వంశీ బిగ్ టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాట్లాడింది రెండు మాటలే అయినప్పటికీ, ఆ మాటల్లో అంతరార్థం వేరయా అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద బిగ్ టీవీతో వంశీ ఏం చెప్పారో చూద్దాం.
ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన ఘటనలో, టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ను వంశీతో పాటు పలువురు కిడ్నాప్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీని హైదరాబాద్ కు వచ్చి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కోరగా, న్యాయస్థానం 3 రోజుల కస్టడీ విచారణకు అనుమతిచ్చింది.
దీనితో మంగళవారం వంశీని పోలీసులు జైలు నుండి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. బుధవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించిన పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. రేపటితో న్యాయస్థానం ఇచ్చిన కస్టడీ గడువు ముగియనుండగా, పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు వంశీ, ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధవారం వంశీ విచారణ పూర్తి కాగానే, పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
ఆ క్రమంలో బిగ్ టీవీ ప్రతినిధి డల్ గా ఉన్నారేంటి అంటూ అడిగిన ప్రశ్నకు వంశీ సమాధానమిస్తూ.. బ్రహ్మాండంగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు. మీపై నమోదవుతున్న కేసుల గురించి ఏం చెబుతారంటూ అడిగిన ప్రశ్నకు, కొత్తగా చెప్పేదేముంది అంతా తెలిసిందే అంటూ పోలీస్ జీప్ ఎక్కారు. సుమారు 5 గంటల విచారణ అనంతరం వంశీని పోలీసులు జైలుకు తరలించారు.
Also Read: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం స్కీమ్.. అర్హతలు ఇవేనా?
వంశీ మాట్లాడిన తీరును బట్టి తనకు ఏ ఇబ్బందులు లేవని చెప్పినట్లుగా భావించవచ్చు. అయితే తనపై కేసులు నమోదు కావడంపై కాస్త గాబరాగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇది ఇలా ఉంటే వంశీపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. భూకబ్జా, రైతులను మోసం చేసినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లపల్లి పారిశ్రామికవాడలో 128 మంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా మోసం చేశారని ఫిర్యాదు అందగా కేసు నమోదైంది. ఓ వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసినందుకు వంశీ, అతని అనుచరులపై మరో కేసు నమోదైంది. ఇలా వంశీపై కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు తెలుపుతున్నారు. బిగ్ టీవీతో వంశీ మాట్లాడిన కామెంట్స్ వైరల్ కాగా, జైలులో మరీ అంత బాగుందా అంటూ టీడీపీ సోషల్ మీడియా అంటోంది.