Thalliki Vandanam Scheme: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు తల్లి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. అయితే ఈ పథకం వర్తించేందుకు నిబంధనలు పాతవేనా? లేక కొత్తగా రూల్స్ ప్రవేశ పెడతారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థులకు ఏడాదికి రూ. 15 వేలు అందించారు. ఆ తర్వాత పాఠశాల మెయింటెనెన్స్ కింద రూ. 1000 నగదును కోత చేశారు. అయితే ముందుగా పథకం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అమ్మ ఒడి పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పథకం అమలుపై శుభవార్త చెప్పడమే కాదు, చదివే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం కూటమి రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకుంది. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. ఒక్క విద్యార్థికే పథకాన్ని అమలు చేస్తారని అందరూ భావించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎంత మంది విద్యార్థులు బడికి వెళితే, అంతమందికి పథకంతో లబ్ది చేకూరుస్తామని ప్రకటించారు. ఈ శుభవార్త అందుకున్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో అర్హతలు ఇవే..
గత వైసీపీ పాలనలో అమ్మ ఒడి పేరుతో పథకాన్ని అమలు చేసినప్పటికీ, కొన్ని అర్హతలను పరిగణలోకి తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే పథకంతో లబ్ది చేకూరింది. అయితే విద్యార్థి తప్పనిసరిగా 75 శాతం బడికి హాజరై ఉండాలి. అలాగే ట్యాక్స్ పేయర్ కాకుండా ఉండాలి. పాఠశాలల లాగిన్ ద్వారా విద్యార్థుల పూర్తి వివరాలు నమోదై ఉన్నప్పటికీ, వారి తల్లుల అకౌంట్ నెంబర్లను సేకరించి నగదు జమ చేశారు.
Also Read: కిక్కిరిసిన శ్రీశైలం.. ఆ అపురూప దృశ్యాలు మీకోసం..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో స్కీమ్ ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టగా, ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయన్న చర్చ సాగుతోంది. గతంలో వైసీపీ పాటించిన నిబంధనల మేరకు లబ్ది చేకూరిస్తారా? లేక మరేదైనా కొత్త నిబంధన తెస్తారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సాధ్యమైనంత వరకు ప్రతి విద్యార్థికి పథకం ద్వారా లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండగా, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు అందజేయడం విశేషం. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి రూ. 30 వేలు ఖాతాలో జమ అవుతుందన్న మాట. మొత్తం మీద ప్రభుత్వం మే నెలలో పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.