JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి తన వయసు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీజేపీని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. బీజేపీ కంటే మాజీ సీఎం జగన్ మేలని, తన బస్సులను కేవలం అడ్డుకున్నారే తప్ప కాల్చిన దాఖలాలు లేవంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంతటితో ఆగక బీజేపీ తన బస్సులను కాల్చివేసిందని, అయినా వెనకడుగు వేసేది లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
ఏంటా వివాదం..
నూతన సంవత్సర వేడుకలో భాగంగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లో మహిళలు వెళ్లరాదని బీజేపీ నేత, సినీనటి మాధవీ లత వీడియో విడుదల చేశారు. ఆ వేడుకలను గంజాయి, డ్రగ్స్ బ్యాచ్ లు తప్పకుండా ఉంటాయని, మహిళలు వెళ్లరాదని సూచించారు. ఈ కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా రిప్లై ఇచ్చారు. ఇలా వివాదం సాగుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీని కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నారని, ఒక్కసారి తన వయసు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఎక్కడో బస్సు కాలితే బీజేపీకి సంబంధం అంటూ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ తగదన్నారు. తనకు ప్రభాకర్ రెడ్డి బస్సులపై పూర్తిగా తెలుసని, కానీ ప్రస్తుతం వాటిపై మాట్లాడదలచుకోలేదని మంత్రి తెలిపారు. కూటమిలో భాగమైన బీజేపీ గురించి మాట్లాడే సమయంలో ప్రభాకర్ రెడ్డి ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత విషయాలు పార్టీకి ఆపాదిస్తే సహించేది లేదన్నారు.
Also Read: YS Jagan @ 11: జగన్ ను వదలని 11 సెగ.. మరీ ఇంత ప్రచారమా!
అయితే జేసి కామెంట్స్ తో కూటమిలో ఇప్పుడిప్పుడే సెగ కనిపిస్తోంది. బీజేపీపై నేరుగా జేసీ చేసిన కామెంట్స్ వైరల్ కాగా, టీడీపీ అధిష్టానం వాటిని చక్కదిద్దే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అలాగే అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారకమునుపే ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే మాధవీలతపై ఇప్పటికే కేసు నమోదు కాగా, బీజేపీ నేతలు కూడ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఈ వివాదం కొనసాగేనా? ఫుల్ స్టాప్ పడేనా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.