Visakhapatnam Central Jail : విశాఖ సెంట్రల్ జైల్లో నిబంధనలు పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ కేంద్ర కారాగారంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టిన అధికారులకు నాలుగు మొబైల్ ఫోన్లు దొరికాయి. ఈ వార్త బయటకు రావడంతో.. జైలులోని పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్య జరుగుతోంది. అసలు అది జైలా, లేక నిందితులకు విడిది ఇళ్లు అంటూ అనేక కామెంట్లు వస్తున్నాయి.
అత్యంత పకడ్భందీగా ఉండాల్సిన జైలులోనేే ఎన్నో అక్రమాలు, మరెన్నో చట్టవిరుద్ధ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని.. బయటి వారెవరో చెప్పడం లేదు. జైలు అధికారులు, సిబ్బంది మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలోని కేంద్ర కారాగారంలో రెండు సెల్ ఫోన్లు, ఒక బ్యాటరీ, రెండు డేటా కేబుళ్లను అధికారులు స్వాధీనం చేసుకోగా.. వారం రోజులు గడవక ముందే మరో నాలుగు సెల్ ఫోన్లు దొరకడం ఇక్కడి పరిస్థితులకు అద్ధం పడుతుంది.
కొన్ని రోజుల క్రితం జైలులో తమ భర్తలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ఖైదీల ముందే బట్టలు విప్పించి తనిఖీలు చేస్తున్నారంటూ సిబ్బంది భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోనళకు దిగారు. దాంతో.. విశాఖ జైలు గురించి అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారులు సైతం దృష్టి పెట్టి ఈ విషయం గురించి ఆరాలు తీశారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఏకంగా 37 మంది జైలు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది ఆరోపణలు చేసిన అధికారుల జోలికి వెళ్లని ప్రభుత్వం.. సిబ్బందినే మార్చేయడంతో అంతా చర్చనీయాంశంగా మారింది.
గతంలోని సిబ్బందిపై అనేక ఆరోపణలు వచ్చాయి. వారు ఖైదీలతో సంబంధాలు ఏర్పర్చుకుని.. గంజాయి, మత్తు పదార్థాలు సహా సిగరేట్లు, మొబైళ్లు అందిస్తున్నారని అనుమానులు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చుతూ.. తాజాగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తన మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మహేష్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టిన సిబ్బందికి.. నర్మదా బ్లాక్ లో ఈ మొబైళ్లను గుర్తించినట్లు తెలిపారు.
పాత వార్డెన్లను వేరే చోటకి తరలించిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టడం సహా వారున్నప్పటి పరిస్థితుల్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన గతంలో వార్డెన్లను తనిఖీ చేసిన విషయంలో జైలు ఉన్నతాధికారుల తప్పు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సిబ్బంది అవకవతకలు, పొరబాట్ల కారణంగానే.. వారిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారని చెబుతున్నారు.
Also Read : సజ్జల చుట్టూ అడవి ఉచ్చు.. ఏ ఒక్కరినీ వదలొద్దంటున్న పవన్ కళ్యాణ్
వాస్తవానికి.. జైలులోకి వచ్చే ముందు, బయటకు వెళ్లే ముందు సిబ్బందికి, ఖైదీలను కలిసేందుకు వచ్చే వారిని తనిఖీలు చేయడం సాధారణం. అలా చేయాలని నిబంధనలే చెబుతున్నాయి కూడా. కానీ.. చాలా చోట్ల సిబ్బంది విషయంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఈ పరిస్థితుల్నే అనుకూలంగా మార్చుకుంటున్న సిబ్బంది.. చట్టవిరుద్ధ పనులకు పాల్పడుతున్నట్లు గుర్తించి.. వారిని బదిలీ చేసినట్లు చెబుతున్నారు.