కాలం మారినా మనుషులు మాత్రం మారడం లేదు. ఓవైపు టెక్నాలజీ పరుగులు పెడుతుంటే మరోవైపు మంత్రాలు, క్షుద్రపూజలు అంటూ తిరుగుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలిసినా వాటిని మాత్రం వీడటంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక చోట క్షుద్రపూజలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, గుప్త నిధుల కోసం, కక్ష సాధింపు కోసం ఇలా ఏదో ఒకదాని కోసం క్షుద్రపూజలు చేశారనే వార్తలు ప్రతిరోజూ వార్తల్లో కనిపిస్తున్నాయి. మారు మూల గ్రామాల్లో ఉండే ప్రజలు మాత్రమే కాదు చదువుకున్నవారు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు, రాజకీయనాయకులు సైతం ఇలాంటివి నమ్మడం బాధాకరం.
Also read: భూసేకరణపై మాట మార్చిన కేటీఆర్, అసలు గుట్టు రట్టు!
తాజాగా ఏపీలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత ఒకరు తన బృందంతో కలిసి క్షుద్రపూజలు చేశారని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లికి చెందిన ఓ వైసీపీ నేతతో కలిసి వజ్ర భాస్కర్ రెడ్డి క్షుద్రపూజల్లో పాల్గొన్నట్టు సమాచారం.
దీంతో భాస్కర్ రెడ్డితో పాటూ మరో వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని సీక్రెట్ గా విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా భాస్కర్ రెడ్డి కదిరిలో వైసీపీ కీలక నేతగా ఉండటం వల్ల పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేత క్షుద్రపూజలు చేస్తున్నారని వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుప్త నిధుల కోసమే ఈ పూజలు చేశారా? ఎవరిపై అయినా కక్ష సాధించడానికి క్షుద్ర పూజలు చేశారా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తుతున్నాయి.