Haka Maori : న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఇటీవల హనా రౌహితీ మైపీ క్లార్క్ అనే ఓ యువ ఎంపీ.. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా వినూత్న శైలిలో నిరసన తెలిపారు. ఆమె నిరసన విధానం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బిల్లు ప్రతుల్ని చించేస్తూ.. ఆమె చేసిన ప్రదర్శిన వైరల్ గా మారింది. దాంతో.. ఆమె ప్రదర్శ గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అయితే.. సరిగా ఏడాది క్రితం సైతం ఆమె ఇలానే ప్రదర్శించి ఆకట్టుకుంటుంది. ఆమె చేసిన ప్రదర్శన.. న్యూజిలాండ్ గిరిజన తెగ అయిన మావోరీ వారసర్వ నృత్యం. ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వం ఉన్న ఈ నృత్య విధానాలను తెలుసుకుంటూ… చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు.
తీవ్ర భావోద్వేగాలు ప్రదర్శిస్తూ.. గతంలో ఆమె తన తెగ గొప్పదనాన్ని చాటి చెప్పింది. కానీ.. ఇప్పుడు, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లును చింపేసి, తీవ్ర నిరసన తెలపడంతో తాత్కాలిక సస్పెన్షన్ కు గురైంది. కానీ.. ఆమె నిరసన తీరు మాత్రం అబ్బురపరించింది. దాంతో..న్యూజిలాండ్ సంప్రదాయ మావోరి ల గురించి, వారి హాకా నృత్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇది కేవలం ఓ నృత్యం మాత్రమే కాదని, తరతరాల తమ ప్రజల సాంస్కృతిక గుర్తింపు, భావోద్వేగాల వ్యక్తీకరణ సాధనమంటున్నారు.. ఈ తెగ పెద్దలు.
హాకా నృత్యం మూలాలు..
మావోరి తెగ ప్రజలకు హాకా చాలా పురాతనమైన సంప్రదాయ నృత్యం. ఈ కళను సూర్య దేవుడైన.. తమ-నుయి-తే-రా(sun god Tama-nui-te-rā) , తానే-రోర్ (Tāne-rore’s) అనే దేవతలు కలిసి సృష్టించినట్లుగా నమ్ముతారు. ఈ నృత్యాన్ని వాళ్లు శక్తికి గుర్తుగా భావిస్తుంటారు. వాస్తవానికి.. సంప్రదాయ హాకాను శక్తిని సమీకరించుకునేందుకు యుద్ధ సన్నాహాల సమయంలో ఎక్కువగా వాడేవారు. కానీ.. ఇప్పుడు.. అతిథుల్ని స్వాగతించేందుకు, విజయోత్సవాల సమయంతో పాటు వివిధ సందర్భంగాల్లో హాకాను ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ ఫుట్ బాల్ టీమ్.. ప్రతీ మ్యాచ్ కు ముందు క్రీడాకారుల్ని సంసిద్ధం చేసేందుకు.. ప్రత్యర్థుల ముందు వారి శక్తిని ప్రదర్శించేందుకు హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కళాలో వారి గిరిజన వారసత్వ సంపద నిండి ఉంటుంది. ఈ నృత్యంలో వినియోగించే ప్రతీ శ్లోకం, ప్రతీ కదలిక గిరిజన సంప్రదాయాన్ని, వాటి గొప్పదనాన్ని తర్వాతి తరాలకు చేరవేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు.. మావోరి పెద్దలు.
సందర్భాన్ని బట్టి ప్రదర్శన
హాకా అనేది ఒకే విధంగా ఉండే నృత్యం కాదు.. దీన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు
మొదటిది – ఈ విధానంలో చేసే ప్రదర్శనల్లో శత్రువులను భయపెట్టడానికి వినియోగిస్తారు. వారి సైన్యం, తెగలోని యోధుల బలాన్ని గుర్తు చేసుకుంటూ, వారి ఐక్యత గురించి వివరిస్తూ.. వారి దగ్గరున్న ఆయుధాలతో చేసే ప్రదర్శన వార్ హాకా
రెండోది – ఈ విధానంలో యుద్ధానికి సిద్ధమైన యోధుల సంసిద్ధతను పరీక్షింస్తుంటారు. చాలా చురుగ్గా ఉండే కదలికలతో పూర్తి స్థాయి యుద్ధ విన్యాసాలకు వెళ్లకుండా.. కేవలం కొన్ని ఆయుధాలతో యుద్ధ సన్నద్ధతను పరీక్షిస్తుంటారు.
మూడోది – ఈ రకం హాకా నృత్యంలో.. పోరాట విన్యాసాలు ఉండవు. ఇందులో కేవలం.. భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సంతోషం, దుఃఖం, కోపం వంటి వాటిని శక్తివంతంగా వ్యకీకరించేందుకు దీనిని మాధ్యమంగా వినియోగిస్తుంటారు. ఇందులో.. వారి ముఖ కవలికలలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
అయితే.. 19 వ శతాబ్దంలో మావోరీ తెగ పెద్ద తే రౌపరాహా (Te Rauparaha) అనే అతను స్వరపరిచిన కా మేట్ (Ka Mate), అనే విధానం బాగా ప్రసిద్ధి చెందింది. ఇది వారి మనుగడ, ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటుంటారు. దీనిని తరచూ.. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నారు.
ది ఆల్ బ్లాక్స్ అండ్ గ్లోబల్ ఫేమ్
న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్ కారణంగా హాకా ప్రపంచంవ్యాప్తంగా ప్రాముఖ్యతను పొందింది. అంతర్జాతీయ వేదికలపై ప్రతీ ఆటకు ముందు ఈ జట్టు.. తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, వారి వారసత్వాన్ని ప్రదర్శించేందుకు.. ‘కా మేట్’ లేదా ‘కపా ఓ పాంగో’ అనే హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇది మావోరీ సంస్కృతికి ఐక్యత, బలం, గౌరవాన్ని సూచిస్తుంది. హాకా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. దాని వారసత్వం మానవాళిని ఏకం చేయడానికి, ధైర్యాన్ని నింపేందుకు, న్యూజిల్యాండ్ దేశీయ సంస్కృతి శక్తిని గుర్తు చేస్తుంది.
Also Read : భూమిపై ఇంకో ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందో తెలుసా?