Bomb Threat to Visakha Airport : దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. కేంద్రం కఠిన చర్యలుంటాయని హెచ్చరించినా, భద్రతా సంస్థలు విస్తృత దర్యాప్తు చేస్తున్నా ఏదో ఓ విమానానికి హెచ్చరిక మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
చెన్నై – విశాఖ, బెంగళూరు – విశాఖ మధ్య సర్వీసులు నిర్వహించే 6E917 – MAA, 6E969 -BLR ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విమానాల్లో బాంబులు అమర్చినట్లు సందేశం రావడంతో అప్రమత్తమైన ఎయిర్ లైన్స్ అధికారులు. స్టేషన్ మేనేజర్ కు సమాచారం అందించగా… ఎయిర్పోర్ట్ లో విమానాన్ని నిలిపివేసి… ప్రయాణికుల్ని దింపివేశారు. భద్రతా సిబ్బంది పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు.
ఈ మధ్య కాలంలో తరచూ ఇలాంటి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తుండగా.. ప్రస్తుత బెదిరింపు ఆడమ్ లామ్‌జా 202 అనే ‘ఎక్స్’ ఖాతా నుంచి వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టేషన్ మేనేజర్ కు సాయంత్రం 05:36 గంటలకు ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిపారు. మరో విమానాన్ని వైజాగ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసి వెంటనే విమానాలను ఐసోలేషన్-బే కు మార్చిన సిబ్బంది.. అందులోనూ తనిఖీలు నిర్వహించారు.
ఈ ఘటనలపై స్పందించిన ఓ ఎయిర్ పోర్ట్ అధికారి.. ఒక్కరోజులోనే భారత్ లోని వేరేవేరు విమాన సర్వీసులకు 62 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. అయితే.. అవ్వన్నీ నకిలీవిగా గుర్తించారు. ప్రతీ హెచ్చరికనూ పరిగణలోకి తీసుకుని భద్రతా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. వాస్తవానికి విమాన సర్వీసుల నిర్వహణకు కఠినమైన నిబంధల్ని అమలు చేస్తుంటారు. ఎలాంటి చిన్న పొరబాట్లకు అవకాశం ఇవ్వరు. అందుకే.. ఏవైనా అనుమానాస్పద, బెదిరింపు కాల్స్ వస్తే కచ్చితంగా విమానాల్ని పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతీ విమానాన్ని ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యి మరో ప్రయాణానికి సిద్ధమయ్యే సమయంలో పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు చేస్తుంటారు. అయినా… ఇలాంటి కాల్స్ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఇలాంటి కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే సర్వీసులు నడిపిస్తున్నామని.. విశాఖ ఎయిర్పోర్ట్ మేనేజర్ వెల్లడించారు. అలానే.. తమ సర్వీసులను నమ్మి వచ్చే కస్టమర్లు, తమ సిబ్బందే తమకు ప్రధానమన్న ఇండిగో సర్వీసెస్ అధికారులు.. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడమని ప్రకటించారు.
Also Read : విమానాలకు బాంబు బెదిరింపులు.. దర్యాప్తు సంస్థల చేతికి చిక్కిన కీలక వ్యక్తి
ఇటీవల వస్తున్న బెదిరింపు కాల్స్ లో దాదాపు అన్నీ నకిలీగానే గుర్తించారు. అయితే.. ఈ తరహా కాల్స్ అన్నీ వీపీఎన్ (VPN) ఉపయోగించి చేస్తుండడం వల్ల.. కాల్స్ చేస్తున్న వ్యక్తుల ఐపీ అడ్రస్ లు, లొకేషన్ వంటి వివరాలను కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్లు దర్యాప్తు సంస్థల అధికారులు చెబుతున్నారు. అయినా.. ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు అత్యున్నత స్థాయిలో.. వివిధ విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి బెదిరింపు కాల్స్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం.. నకిలీ సమాచారాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని కోరింది.