మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సడన్ గా పవన్ కల్యాణ్ పై ప్రేమ పుట్టుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కి అన్యాయం జరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సీఎంకి ఇస్తున్న ప్రయారిటీ డిప్యూటీ సీఎంకి ఇవ్వడం లేదన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారానికి పత్రికలు ఫస్ట్ పేజీని కేటాయిస్తున్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్తలు, పర్యటనలను కేవలం జిల్లా పేజీలకే పరిమితం చేస్తున్నారని అన్నారు బొత్స.
పోనీ సాక్షి ఇవ్వొచ్చుగా..
బొత్స సత్యనారాయణ ఆవేదనలో నిజం ఉంది అనుకుందాం. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉందనుకుంటున్న మీడియా ఆయనకు ప్రయారిటీ ఇచ్చి, పవన్ కి తగ్గించిందే అనుకుందాం. మరి సాక్షిలో అయినా పవన్ వార్తల్ని హైలైట్ అయ్యేలో బొత్స ప్రయత్ననం చేసి ఉండొచ్చు కదా. సీఎం చంద్రబాబుకి పోటీగా సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలో డిప్యూటీ సీఎం వార్తలు వచ్చేలా చూడొచ్చు కదా. పవన్ పై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న బొత్స, ముందు ఆ ప్రయత్నం చేయాలంటూ కౌంటర్లు పడుతున్నాయి.
ఇంతకీ జగన్ కి తెలుసా..?
వాస్తవానికి కూటమి నేతలపై వైసీపీ చూపిస్తున్న ప్రేమను కాస్త అనుమానించాల్సిందే. ఇప్పటికే పిఠాపురంలో గొడవలు పెట్టాలని వర్మని ఎగదోస్తోంది జగన్ మీడియా. మరోవైపు కొలికపూడి విషయంలో కూడా తెగేదాకా లాగాలని చూస్తోంది. ఆ ప్లాన్లు వర్కవుట్ కాకపోవడంతో సీనియర్ నేత అయిన బొత్స రంగంలోకి దిగారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. పవన్ గురించి బొత్స అంటున్న మాటలేవీ ఆయన మనసులోనుంచి వచ్చినవి కాదని, టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ పెంచడానికే ఆయన అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఒకరకంగా ఇది జగన్ ఆడిస్తున్న డ్రామానే అని కూడా అంటున్నారు. అయితే ఇది నిజంగా జగన్ డైరక్షన్లోనే జరుగుతోందా, లేక ఈ వ్యవహారం గురించి బొత్సే ముందుగానే జగన్ కి చెప్పారా అనేది తేలాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా బొత్స ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ని కలిసేవారు, మాట్లాడేవారు. అప్పట్లో బొత్స పార్టీ మారతారేమోననే వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని, టీడీపీ-జనసేన కూటమిలో చిచ్చు పెట్టేందుకే బొత్స అలా పవన్ కి దగ్గరైనట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారనేది టీడీపీ అనుమానం.
కూటమిలో లుకలుకలు రావాలని వైసీపీ నేతలు వేచి చూస్తున్నారు. జనసేన లేకపోతే టీడీపీకి అన్ని సీట్లు వచ్చేవి కావని కొందరు సీనియర్లే చెప్పడం విశేషం. గతంలో పవన్ కల్యాణ్, చంద్రబాబుకి దత్త పుత్రుడంటూ మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు పవన్ పై సింపతీ చూపెడుతూ.. ఆయన చలవ వల్లే చంద్రబాబు గెలిచారంటున్నారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పవన్ కూడా ఎప్పటికప్పుడు పరోక్షంగా స్పందిస్తూనే ఉన్నారు. తామంతా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని, మళ్లీ ఆయనే సీఎం అవుతారని అంటున్నారు. అనుకూల మీడియాతో మాట్లాడించడం, వైసీపీ అభిమానుల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం వేరు. ఇప్పుడు నేరుగా బొత్స లాంటి నేతలు రంగంలోకి దిగడం మాత్రం నిజంగా విశేషం. మరి అడక్కుండానే ప్రేమ చూపించిన బొత్సకు జనసేన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.