Botsa Satyanarayana: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరంలోనైనా పాలకులకు భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఏడాది ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చిందని, రూ. 250 ఉండాల్సిన యూరియాను రూ. 500కు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతుల తరఫున క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే.. ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని పక్కనపెట్టి రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా వితంతువులకు రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని, తల్లీకి వందనం పథకం ఇంకా 4 లక్షల మంది పిల్లలకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తవ్వడంపై స్పందిస్తూ.. ఈ క్రెడిట్ ముమ్మాటికీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని బొత్స స్పష్టం చేశారు. భూ సేకరణ కోసం జగన్ రూ. వెయ్యి కోట్లు కేటాయించారని, 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని GMR సంస్థను కోరడం వల్లే పనులు వేగంగా జరిగాయని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు GMR పేరును ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానంగా విశాఖ నుంచి హైవేను నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న విశాఖ మాస్టర్ ప్లాన్‌ను వెంటనే ఫైనల్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వాహనాలు లేవని డీజీపీ చెప్పడం సిగ్గుచేటని బొత్స ధ్వజమెత్తారు. బాలకృష్ణ సినిమా కోసం థియేటర్ల వద్ద పొట్టేళ్లను బలి ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అమ్మాయిలు మిస్సింగ్ అని గగ్గోలు పెట్టిన వారు, అధికారంలోకి వచ్చాక ఎంతమందిని వెతికి పట్టుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇక, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా విదేశాలకు వెళ్లడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా వెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఏపీ-తెలంగాణ జలవివాదంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన లేఖను ప్రస్తావిస్తూ.. నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమైతే, చంద్రబాబు చెప్పేవన్నీ నిజాలేనా అని బొత్స ప్రశ్నించారు.
Read Also: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు