BRS YCP – Jamili Elections: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుపై పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయా? ఎన్నికలు ముందుగా వస్తాయని కొన్ని పార్టీలు భావిస్తున్నాయా? జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయా? 2027లో జమిలి ఎన్నికలు ఉండవని కేంద్రం సంకేతాలు ఇచ్చిందా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు నేపథ్యంలో మరో రెండేళ్లలో ఎన్నికలు రావచ్చని కొన్ని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు నేతలు. సంక్రాంతి తర్వాత రంగంలోకి దిగుతున్నట్లు వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చేశారు. జిల్లాల్లో పర్యటించిన కేడర్, నేతల్లో ఉత్సాహం నింపేందుకు ప్లాన్ చేశారు. ఈసారి వేగంగా ఎన్నికలు వస్తున్నాయని, మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కేడర్‌ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తెలంగాణ విషయానికొద్దాం. వైసీపీ మాదిరిగా బీఆర్ఎస్ కూడా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. తనను తొందరగా అరెస్ట్ చేస్తే.. జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని సంకేతాలు ఇచ్చేశారు ఎమ్మెల్యే కేటీఆర్. పెద్దాయన ఆలోచన ప్రకారం.. జాగృతి సంఘాలు, జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎమ్మల్సీ కవిత. అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచిస్తున్నారు మాజీ సీఎం.
మనం ఒకటి తలస్తే దైవం మరొకటి తలచినట్టుగా ఉంది బీఆర్ఎస్-వైసీపీల పరిస్థితి. వీటితోపాటు మరి కొన్ని పార్టీల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో రావనే సంకేతాలు హస్తినలో జోరుగా వినిపిస్తోంది. ఈనెల 16న అంటే సోమవారం పార్లమెంటుకు రానుంది ఈ బిల్లు. ఇప్పట్లో జమిలి ఎన్నికలు కష్టమని అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఇందుకు కారణాలు సైతం లేకపోలేదు.
ALSO READ: శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు
గురువారం క్యాబినెట్ ఆమోదించిన బిల్లులు ఎలాంటి మార్పులు లేకుండా పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందాలి. దీనికితోడు మొన్నటి బడ్జెట్ తొలి సెషన్‌లో బిల్లు పెడితే షెడ్యూల్ ప్రకారం 2029లో జమిలి ఎన్నికలు జరిగేవని అంటున్నారు. ఈ లెక్కన బిల్లులు మార్పులు జరిగితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం 2034లో మాత్రమే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ కొత్తవి తెరపైకి తెచ్చిందట. నివేదికలోని కొత్త నిబంధన ప్రకారం ఆర్టికల్ 82 A(1)ని ప్రవేశపెట్టాలని సూచన చేసిందట. ఆ తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి రాష్ట్రపతి నియమించిన తేదీని తెలియజేస్తారని పేర్కొంది. తప్పదనుకుంటే బిల్లులో మార్పులు చేయాలని భావిస్తోందట. ఇదొక వెర్షన్.
మరో వెర్షన్‌కి వద్దాం.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం పెద్ద కసరత్తు చేయాలి. రాజకీయ ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం, పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించడం కేవలం ప్రారంభం మాత్రమే. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఏక కాలంలో ఓటింగ్ జరిగేలా కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ల-EVM కోసం కమిషన్ ఆర్డర్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఒకేసారి ఎన్నికలకు అవసరమైన ఈవీఎంల సంఖ్యను రెట్టింపు చేయాలి. వాటికి కనీసం ఎలాగలేదన్నా రెండున్నర నుండి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అందులో చిప్స్, ఇతర మెటీరియల్ సేకరణకు ఏడెనిమిది నెలల సమయం పడుతుందట. ఈవీఎంలు తయారు చేసే ఈసీఐఎల్, బీఈఎల్ వంటి కంపెనీలు ఉత్పత్తి భారీ స్థాయిలో ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుందని అంటున్నాయి. సోమవారం లోక్‌సభలో పెట్టబోయే బిల్లులో ఏయే అంశాలు ప్రస్తావిస్తారో చూడాలి.