Chandrababu Govt: ఎన్నికల్లో ఇచ్చి హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తోంది కూటమి సర్కార్. తూర్పుగోదావరిలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మాటేంటి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి అవుతోంది. ఈ కేసు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తెర వెనుక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది?
కేసు ఏంటి?
వైసీపీని డ్యామేజ్ చేసిన వ్యవహారాల్లో డ్రైవర్ సుబ్రహ్యణ్యం కేసు ఒకటి. మూడేళ్ల కిందట 2022 మే 18న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాన్ని కారులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు హాట్ టాపిక్ అయ్యింది. చనిపోయిన సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి.
అన్నివర్గాల నుంచి విమర్శలు రేగడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపడం జరిగిపోయింది. దాదాపు ఆరు నెలలుపాటు జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన, జనంలోకి వెళ్లలేదు. కాకపోతే వైసీపీ పబ్లిక్ మీటింగులకు హాజరయ్యేవారు.
ఈ వ్యవహారాన్ని అప్పటి ప్రతిపక్షం టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంది. ఇదే క్రమంలో డ్రైవర్‌ని అనంతబాబు ఉద్దేశపూర్వకంగా చంపలేదని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు పోలీసులు. తాము అధికారంలోకి రాగానే న్యాయస్థానం చేస్తామని టీడీపీ పదేపదే చెప్పుకొచ్చింది. దళిత కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.
ALSO READ: విశాఖ శారద పీఠానికి టీటీడీ ఝలక్, అసలేం జరిగింది?
దీని ప్రభావం గత ఎన్నికల్లో వైసీపీపై బలంగా పడిందన్న రాజకీయ విశ్లేషణలు లేకపోలేదు. దళితులు కూటమి సపోర్టు చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసు వ్యవహారంపై కూటమి సర్కార్ బూజు దులుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎసిపోడ్‌పై నివేదిక కోరాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేసు బూజు దులుపుతున్న కూటమి?
ఇందులో అనంతబాబుతోపాటు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బెయిల్ క్యాన్సిల్ కోసం గ్రౌండ్ ప్రిపేర్ జరుగుతున్నట్లు టీడీపీలో ఓ వార్త హంగమా చేస్తోంది. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు బూజు దులిపితే డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అంటున్నారు. అప్పుడు దీని ప్రభావం వైసీపీపై బలంగా ఉంటుందని అంటున్నారు.
అందుకే హత్యకు గల కారణాలను ఎస్టాబిస్ట్ చేసే పనిలో అధికారులు ఉన్నట్లు గుసగుసలు లేకపోలేదు. దాదాపుగా అనంతబాబుకు కార్నర్ చేయడానికి స్కెచ్ సిద్ధమైనట్టేనని అంటున్నారు. సుబ్రహ్యణ్యం కుటుంబం తరపున అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాసిక్యూషన్‌కు సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది.
దీంతో అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్టేనన్న అనుమానాలు లేకపోలేదు. అదే జరిగితే కూటమికి ముఖ్యంగా టీడీపీకి మాంచి మైలేజ్ వస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల చివర లేదా వచ్చే నెలలో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని అంటున్నారు.