Rushikonda Palace: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం, రుషికొండ ప్యాలెస్ వినియోగం, రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రులకు ఆయన కీలక సూచనలు చేశారు.
అమరావతిపై విమర్శలు, రైతులకు స్మారక చిహ్నం
రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ‘గొడ్డలి పార్టీ’ పనిగట్టుకుని విషప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ వంటి సంస్థలకు ఫిర్యాదులు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను కూడా హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. అమరావతి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి గుర్తుగా ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ సూచించగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
ప్రజల సందర్శనకు రుషికొండ ప్యాలెస్
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక రంగానికి వినియోగించాలని కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా ప్రజలందరికీ తెలియాలంటే.. ఆ ప్యాలెస్‌ను సామాన్య ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన సీఎం చంద్రబాబు, సందర్శకులను అనుమతించేందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు.
పెట్టుబడుల రక్షణ చట్టం, హార్టికల్చర్ హబ్
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు పెట్టుబడుల రక్షణ చట్టాన్ని జనవరి నాటికి ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రాజెక్టుల ప్రారంభం, పూర్తికి సంబంధించి స్పష్టమైన క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, డిసెంబరు 1న హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రులకు తెలిపారు. దీని పర్యవేక్షణకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి సీఈవోను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: NRIలకు IBM బిగ్ షాక్.. ఇండియాకు తిరిగి రావాల్సిందేనా?