Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వివాదాలు లేని హీరోల్లో అజిత్ ఒకడు. కోలీవుడ్ లో విజయ్ కి అజిత్ కి పడదు అని అంటారు కానీ, వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. అభిమానులే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలను అజిత్ అస్సలు పట్టించుకోడు. అయితే సినీకా.. లేకపోతే రేస్. ఈ రెండు లేకపోతే కుటుంబం. ఇదే అజిత్ ప్రపంచం.
ఇక చాలా తక్కువగా అజిత్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ తన మనోగతాన్ని బయటపెట్టాడు. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అజిత్ 64 సినిమా వరకు అన్ని చెప్పుకొచ్చాడు. కుటుంబం, పిల్లలు, భార్య షాలిని.. తన ఇష్టాలు అన్ని ఇందులో పంచుకున్నాడు. ఇక మొట్ట మొదటిసారి విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు.
ఈ ఏడాది జరిగిన విషాద సంఘటనలలో కరూర్ తొక్కిసలాట ఒకటి. విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం విజయ్ తప్పు అని తమిళనాడు మొత్తం కోడై కూస్తోంది. దానికి విజయ్ సైతం బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ తొక్కిసలాట గురించి స్పందించారు.
ఇక తాజాగా అజిత్ కూడా ఈ తొక్కిసలాట గురించి స్పందించాడు. ఇది కేవలం విజయ్ తప్పు మాత్రమే కాదని, మన అందరం బాధ్యులమే అని చెప్పుకొచ్చాడు.”నేను ఎవరినీ వేలు ఎత్తి చూపించడం లేదు. ఒక వ్యక్తినే నిందించడం లేదు. ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో ప్రతిదీ మార్చేసింది. ఇది తప్పనిసరిగా ఆ ఒక్క వ్యక్తి తప్పు కాదు. అది మనలో ప్రతి ఒక్కరి తప్పు. దానికి మనమందరం బాధ్యులమే.
కేవలం సినీ సెలబ్రిటీలు ఉన్న సభల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది. లక్షల మంది క్రికెట్ మ్యాచ్ లు చూడడానికి వెళ్తున్నారు. అక్కడ ఇలాంటివేమీ జరగడం లేదు. థియేటర్లలలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతున్నాయి. దీనివలన ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజిత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.