
TDP: ఏపీ రాజకీయాలు కీలక దశలో ఉన్నాయి. రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. జగన్, చంద్రబాబు, పవన్.. ఎవరూ తగ్గట్లే. పదునైన విమర్శలు, హద్దు దాటుతున్న వ్యాఖ్యలతో.. వేడి రాజేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రయాంగిల్ వార్ జరగొద్దని గట్టిగా ప్రయత్నిస్తున్నారు జనసేనాని. బీజేపీ, టీడీపీలతో కలిసి.. ఉమ్మడిగా వైసీపీపై దండయాత్ర చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాకపోవడంతో.. పొత్తుల మిస్టరీ కొనసాగుతోంది. వైసీపీ మాత్రం దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ.. ప్రత్యర్థి పార్టీలను తెగ కవ్విస్తోంది.
ఇలాంటి సమయంలో.. లేటెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై తనదైన స్టైల్‌లో కామెంట్ చేశారు. పొత్తుల గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ.. తనకు మాత్రం ఏపీ రాష్ట్ర అభివృద్ధి మొదటి ప్రాధాన్యతా అంశమన్నారు. తన నిర్ణయం ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఉంటుందని చెప్పారు. అన్ని విషయాలను ఆలోచించి రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంటుందంటూ.. ఇటీవల ఓ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత ఇలా స్పందించారు. ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి.. చులకన కాదల్చుకోలేదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కామెంట్లు.. ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆయన పొత్తులపై పాజిటివ్‌గా మాట్లాడారా? లేదంటే, చులకన కాదల్చుకోలేదని అన్నారంటే.. ఆయన పొత్తులపై విముఖంగా ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది.
పవన్ కల్యాణ్‌తో పలుమార్లు చర్చలు.. ఢిల్లీలో షా, నడ్డాలతో మంతనాల తర్వాత.. కొంతకాలంగా మళ్లీ ఎలాంటి భేటీలు జరగలేదు. ఎవరికి వారే అన్నట్టు రాజకీయం చేసుకుపోతున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. పవన్ కల్యాణ్ వారాహి మీద విజయయాత్ర చేస్తున్నారు. కమలదళం ఏకంగా అధ్యక్షుడినే మార్చేసి.. పురందేశ్వరికి పగ్గాలు అప్పగించి.. నయా లుక్ తీసుకొచ్చింది. ఇలా మూడు పార్టీలు వేరువేరుగా పొలిటికల్ హీట్ రగిలిస్తున్నారు. మరి, ఈ ట్రాయాంగిల్ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేక, ట్రయాంగిల్ వార్‌గా మారుతుందా? చంద్రబాబు తాజా వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? బాబు మాటల వెనుక మర్మం ఏంటి? అనేది ఏపీలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.
Pawan Kalyan: టీడీపీ, బీజేపీ మధ్య ఇష్యూ.. పవన్ సంచలన కామెంట్స్..