Driverless Trains: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఆల్స్టోమ్ తయారీ కేంద్రం మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. చెన్నై మెట్రో రెండో దశ కోసం 32 డ్రైవర్‌లెస్ రైళ్లను ఇక్కడ తయారు చేయనున్నారు. మొత్తం 96 బోగీలతో రూపొందనున్న ఈ రైళ్లు గ్రేడ్ ఆఫ్ ఆటోమేషన్-4 సాంకేతికతతో పనిచేస్తాయి. రైలు ప్రారంభం నుంచి వేగ నియంత్రణ, స్టేషన్లలో ఆగడం, తలుపులు తెరవడం, మూయడం వరకు అన్ని కార్యకలాపాలు ఆటోమేటిక్‌గా సాగుతాయి.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో ఒక్కో మూడు బోగీల సెట్‌లో సుమారు 900 మంది ప్రయాణించవచ్చు. సీసీటీవీ కెమెరాలు, సమాచార డిస్‌ప్లేలు, మహిళలు, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఆదా కూడా సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టుతో రైళ్ల తయారీతో పాటు అనుబంధ పరిశ్రమలు, స్థానిక ఉపాధి అవకాశాలకు కూడా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. దీంతో శ్రీసిటీ పారిశ్రామిక ప్రాధాన్యత మరింత పెరగనుంది.
ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిన తిరుపతి జిల్లా.. ఇప్పుడు అత్యాధునిక రైల్వే సాంకేతికతకు చిరునామాగా మారుతోంది. శ్రీసిటీలో తయారయ్యే డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు చెన్నై నగరంలో పట్టాలెక్కనుండటం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మరో గుర్తింపు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోనే ప్రపంచస్థాయి మెట్రో రైళ్ల తయారీ జరగడం విశేషం.
Also read: ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!