Water Dispute: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కీలక నీటి నిర్వహణ, పంపిణీ వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మూడో సమావేశానికి రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. చర్చించాల్సిన అజెండా అంశాలతో పాటు గోదావరి-కావేరి అనుసంధానం (జీసీ లింక్)పై తీసుకున్న చర్యల నివేదికను తక్షణమే పంపాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ప్రాజెక్టు మదింపు సంస్థ (పీఏఓ) చీఫ్ ఇంజినీర్, కమిటీ సభ్య కార్యదర్శి రాకేష్ కుమార్.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు.
గత సెప్టెంబరు 7న జరిగిన రెండో సమావేశం మినిట్స్‌లోని అంశాలను సీడబ్ల్యూసీ తన లేఖలో ప్రస్తావించింది. గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై భాగస్వామ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయానికి రావాలని గత భేటీలో నిర్ణయించారు. ఇచ్చంపల్లి నుంచి 148 టీఎంసీల నీటిని తరలించేలా జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డీపీఆర్ రూపొందించిందని, అయితే పోలవరం నుంచి పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో నీటిని మళ్లించే అంశంపైనా ఇటీవలి భేటీల్లో చర్చ జరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జీసీ లింక్‌పై ఏకాభిప్రాయ సాధనకు ఇరు రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై సంక్షిప్త నివేదిక (బ్రీఫ్ నోట్) అందజేయాలని కోరింది.
రెండో సమావేశం నిర్ణయం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలు తమ అజెండా అంశాలను పూర్తి గణాంకాలు, ఆధారాలు, అధ్యయన నివేదికలు, సమర్థనలతో సహా సెప్టెంబరు నెలాఖరులోగానే కేంద్ర కమిటీకి సమర్పించాల్సి ఉంది. కానీ, గడువు దాటి నెలలు గడుస్తున్నా ఇరు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అజెండా అంశాలు అందలేదని సీడబ్ల్యూసీ అసహనం వ్యక్తం చేసింది. వచ్చే కొద్ది వారాల్లోనే మూడో సమావేశం జరగనున్నందున, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలను పంపాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.
Also read: గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!