IRCTC New Ticket Booking Rules: రైలు ప్రయాణం చేయాలనుకునే వారు టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం కామన్. ముఖ్యంగా పండుగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్‌లో రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. చాలామంది ప్రయాణానికి కొద్ది నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, రైల్వే ఈ ముందస్తు టికెట్ బుకింగ్ విధానంలో మరోసారి మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల బుకింగ్ గడువును మరింత తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో భారతీయ రైల్వేలో రిజర్వ్డ్ టికెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, ఈ విధానంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చాలామంది ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణ సమయం దగ్గరపడినప్పుడు వాటిని రద్దు చేసుకునేవారు. దీంతో నిజంగా ప్రయాణించాలనుకునే వారికి కన్ఫర్మ్ టికెట్లు దొరకడం కష్టమయ్యేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే 2024 నవంబర్ 1 నుంచి ముందస్తు బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించాయి. ప్రస్తుతం సాధారణ రిజర్వ్డ్ టికెట్లకు ఇదే విధానం కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల ముందస్తు బుకింగ్ విధానాన్ని మరోసారి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్ లెక్కలు, ప్రయాణికుల రిజర్వేషన్ విధానాలను పరిశీలించి గడువును తగ్గించే అంశంపై రైల్వేలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే 60 రోజుల బుకింగ్ వ్యవధి 30 నుంచి 45 రోజులకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే, దీనిపై రైల్వే శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ రిజర్వ్డ్ రైలు టికెట్లను ప్రయాణ తేదీకి 60 రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ లెక్కింపులో ప్రయాణ తేదీని చేర్చరు. IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు పొందవచ్చు. కొన్ని ప్రత్యేక రైళ్లకు మాత్రం వేర్వేరు బుకింగ్ నిబంధనలు ఉండవచ్చు. అలాగే విదేశీ పర్యాటకులకు 365 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కొనసాగుతోంది.
రైల్వేలు ప్రయాణికుల అవసరాలు, టికెట్ బుకింగ్ విధానాలను బట్టి ఎప్పటికప్పుడు నిబంధనలను సమీక్షిస్తుంటాయి. ముందస్తు బుకింగ్ గడువును తగ్గించడం వల్ల టికెట్లను అనవసరంగా బుక్ చేసి రద్దు చేసే విధానం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, కొత్త మార్పుపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల బుకింగ్ విధానమే అమల్లో ఉంటుంది.
Read Also: పశ్చిమ కనుమల మీదుగా కొత్త వందే భారత్.. ప్రయాణమంతా ప్రకృతి అందాలే!