Simhadri Appanna Temple: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం.. తీవ్రంగా వీచిన గాలులు.. అప్పుడే నిర్మించిన గోడ.. ఈ మూడు సింహాద్రి అప్పన్న స్వామి భక్తుల పాలిట శాపంగా మారాయి. ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీశాయి. సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం జరుగుతోంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొందరు రాత్రి సమయంలోనే వచ్చి ఆలయంలో నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడం.. భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో అక్కడున్న గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురి ప్రాణాలు పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వరకు 300 రూపాయల టికెట్ క్యూలైన్ ఉంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చందనోత్సవం కోసం భారీ సంఖ్యలో అప్పటికే భక్తజనం తరలివచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే NDRF సిబ్బంది, అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, సీపీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. చందనోత్సవం కావడంతో భక్తుల కోసం ఓ భారీ టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాలివాన సమయంలో టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి.. రిటైనింగ్ వాల్‌పై పడిపోయాయి. వర్షం కారణంగా ఆ గోడ అప్పటికే పూర్తిగా నానిపోయి ఉండటం.. అదే సమయంలో స్తంభాలు పడటంతో గోడ కూలి.. పక్కనే ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.
సింహాచలం ఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించారు అధికారులు.
అలాగే..తెలంగాణ సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రేవంత్. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని.. భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి!
గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.