 
					Kadapa: కడప జిల్లాలో ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు, 400 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనపై భక్తుల నుంచి తీవ్ర ఆవేదన, అధికారుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని కడప కలెక్టర్‌ను ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది.
తాజా అప్‌డేట్ ప్రకారం, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా అధికారులతో కలిసి కూలిన నివాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, గృహ సంరక్షకులను అడిగి వివరాలు సేకరించారు. బ్రహ్మంగారు తపస్సు చేసిన పవిత్ర స్థలంలోనే, 1978-79 కాలంలో ఈ గృహాన్ని మట్టి, పలకరాయి, చెక్క స్తంభాలతో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
Read Also: Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్
స్వల్పంగా కూలిన ఈ కట్టడాన్ని వెంటనే పునర్నిర్మించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా, పూర్వపు ఉనికిని ఏమాత్రం కోల్పోకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ‘ఇంటాక్’ (INTACH) సంస్థ సహకారం తీసుకోవాలని, అప్పటి నిర్మాణంలో వాడిన అసలైన మెటీరియల్‌నే తిరిగి ఉపయోగించి పునరుద్ధరించాలని సూచించారు. అంతేకాకుండా, ప్రత్యేక ఆర్కిటెక్ట్‌లు, ధార్మిక పరిషత్ సలహాలు కూడా తీసుకోవాలని ఆదేశించారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపద విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, శిథిలావస్థలో ఉన్నప్పుడే మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని భక్తులు విమర్శిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాల నేపథ్యంలో, కలెక్టర్ సూచనల మేరకు, చారిత్రక కట్టడానికి నష్టం కలగకుండా పాత శైలిలోనే నివాసాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.