APSRTC EHS Scheme: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. జనవరి 1, 2020 తర్వాత రిటైర్డైన ఉద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగితో పాటు జీవిత భాగస్వామికి ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించనున్నారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం, మందులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు సింగిల్ ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు వారికి రూ.51,429 సింగిల్ ప్రీమియం చెల్లించాలని సూచించింది. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫార్సులతో ఈహెచ్‌ఎస్ ఆస్పత్రుల్లో విశాంత్ర ఉద్యోగులకు చికిత్స అందించనున్నారు. ప్రస్తుత ఉద్యోగులకు అందించే మెడికల్ రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని విశాంత్ర ఉద్యోగులకు కల్పించనున్నారు. ఈహెచ్ఎస్ స్కీమ్ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబు, ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి.
ఏపీఎస్ఆర్టీసీలో పలువురు ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదోన్నతులు కల్పించింది. రీజనల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఆరుగురు ఆర్టీసీ అధికారులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇప్పటి వరకు వీరంతా ఇన్ ఛార్జ్ ఈడీలుగా పనిచేస్తుండగా, ఇటీవల వారికి పూర్తిస్థాయి ఈడీలుగా పదోన్నతులు కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులలో విజయవాడ జోన్ లో జి. విజయరత్నం, జీవీ రవివర్మ, టి. చెంగల్‌రెడ్డి ఉన్నారు. వీరితో పాటు కడప జోన్ పి. చంద్రశేఖర్, ఆపరేషన్స్ కు చెందిన ఎ. అప్పలరాజు, నెల్లూరు జోన్ కు చెందిన జి. నాగేంద్రప్రసాద్ లకు ఈడీలుగా ప్రమోషన్ కల్పించారు.
మరో 15 మంది సీనియర్ కేడర్ అధికారులకు కూడా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వీరిని స్పెషల్ స్కేల్ సర్వీస్ కేడర్‌కు పదోన్నతులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదోన్నతుల ద్వారా ఆర్టీసీ కీలక విభాగాల్లో పరిపాలనను పటిష్ఠం చేయనుంది.