 
					Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ విమర్శించిన భీమవరం డీఎస్పీ జయసూర్యకు కేంద్రం అవార్డ్ ఇచ్చింది. పటేల్ జయంతి సందర్భంగా అవార్డ్స్ కేంద్రం ప్రకటించింది. డెడ్ బాడి పార్సిల్ కేసులో సమర్ధవంతంగా విచారణ చేసి దోషులను పట్టుకున్నందుకుగాను ఏపీ నుంచి నలుగురికి హోంశాఖ అవార్డులను ప్రకటించింది. ఆ అవార్డులకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, అడిషనల్ ఎస్ పి భీమారావు , భీమవరం డివిజన్ డీఎస్పీ జయసూర్య, ఉండి ఎస్ ఐ నాసిరుల్లా ఎంపికయ్యారు. ఇటీవల డీఎస్పీ జయసూర్య పనితీరుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. ఆయన పనితీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ డీఎస్పీకి కేంద్రం అవార్డు ప్రకటించడం కొంత చర్చకు దారి తీసింది.
ఈ నలుగురు అధికారులు తమ అసాధారణ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించారని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్రం నుంచి అవార్డు లభించిన డీఎస్పీ జయసూర్యపై కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. జయసూర్య పనితీరుపై పవన్ కళ్యాణ్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా భీమవరం డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని.. సివిల్ వివాదాలలో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని.. కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల (ముఖ్యంగా జనసేన నేతల) పేర్లను వాడుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్, వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. అంతేకాక, ఈ వ్యవహారాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీలకు కూడా తెలియజేయాలని తన కార్యాలయం అధికారులను ఆదేశించారు.
ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విచారణ ఎదుర్కొంటున్న అధికారికి, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర స్థాయిలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుండగా.. జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు లభించడం.. ‘సమర్థతకు కొలమానం ఏంటి?’ అనే ప్రశ్నలు బయట ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సాధారణంగా, అవార్డులకు ఎంపికయ్యే అధికారుల సర్వీస్ రికార్డు, పనితీరును వివిధ స్థాయిల్లో పరిశీలిస్తారు. డెడ్ బాడీ పార్సిల్ కేసులో ఆయన చూపిన దర్యాప్తు నైపుణ్యం కేంద్ర దృష్టికి వెళ్లగా, స్థానికంగా ఆయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చాయి. ఈ రెండు భిన్నమైన పరిణామాలు, ఒకే అధికారికి సంబంధించి ఉండటంతో ఈ అంశం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
రానున్న రోజుల్లో డీఎస్పీ జయసూర్యపై ఎస్పీ సమర్పించే నివేదిక.. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఏదేమైనా.. ఒకే సమయంలో విమర్శలు, ప్రశంసలు దక్కించుకున్న డీఎస్పీ జయసూర్య ఉదంతం, ఏపీ పోలీస్ శాఖలో ఆసక్తికరమైన మలుపుగా మారింది.