AP Ministers Ranks: ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంతో ఎవరైనా ఏపీ సీఎం చంద్రబాబు తరువాతే అంటారు రాజకీయ విశ్లేషకులు. అలా ఎందుకు అంటారో.. చెప్పేందుకు గురువారం ఒక సందర్భం వచ్చేసింది. ఏపీ కేబినెట్ సమావేశం గురువారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. అయితే ఇక్కడే మంత్రుల పనితీరును కూడ సమీక్షించి ర్యాంక్స్ కేటాయించారట సీఎం చంద్రబాబు.
ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు పలు అంశాలను లేవనెత్తి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వైరల్ ఫీవర్ కారణంగా పవన్ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్లు నిన్ననే డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటించింది. మిగిలిన మంత్రులందరూ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రుల పనితీరు గురించి సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రధానంగా ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉందో చంద్రబాబు వివరించారు.
మంత్రుల పనితీరును ప్రకటించిన చంద్రబాబు.. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టారని చెప్పవచ్చు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను ఆరో స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి హోదా లో గల పవన్ కళ్యాణ్ పదో స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మొత్తం కేబినెట్ లో ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మహమ్మద్ ఫరూఖ్ మొదటి స్థానంలో ఉండగా, చివరి స్థానంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూఖ్ ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Railway Rules: ట్రైన్‌లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్.. ఈ రూల్స్ పాటించండి.. లేకుంటే?
ఓవైపు శాఖల సమీక్షలతో పాటు, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ మంత్రులు తగిన చొరవ చూపాలని సీఎం చంద్రబాబు సూచించారు. అనంతరం వచ్చే మూడు నెలలపాటు మంత్రులు ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు.