Ramoji Awards: రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ (వ్యవస్థ) అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. “రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, రామోజీరావుతో తనకున్న 40 ఏళ్ల అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. “రామోజీరావు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన నిర్మించిన వ్యవస్థలు మాత్రం స్థిరస్థాయిగా, శాశ్వతంగా ఉంటాయి. ఇందులో ఎవరికీ అనుమానం లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
రామోజీరావు నిబద్ధత, నిజాయితీ గురించి చంద్రబాబు పలు కీలక విషయాలను పంచుకున్నారు. “నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, నేను అనేక హోదల్లో ఉన్నాను. కానీ రామోజీరావు తన జీవితంలో ఒక్క చిన్న ఫేవర్ గానీ, చిన్న పని గానీ అడిగిన సందర్భం లేదు. ఆయన జీవితంలో నేను చూసింది పోరాట యోధుడినే,” అని అన్నారు. తనతో గంటల తరబడి చర్చించేవారని, “మీరు నన్ను గురించి, నా ఆర్గనైజేషన్ గురించి ఏ ఫేవర్ అడగవద్దు. మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చర్చకు రండి, నీకు నచ్చితే చెయ్యి,” అని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు తానే ప్రతిపక్షంగా పనిచేస్తానని చెప్పి, ప్రజల పక్షాన నిలబడిన యోధుడు రామోజీరావు అని చంద్రబాబు కొనియాడారు. “మీరు మంచి చేస్తే మీతో ఉంటా, ప్రజలకు చెడు చేస్తే మాత్రం మిమ్మల్ని బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తా” అని ముఖం మీదే చెప్పి, ఆ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి అని ప్రశంసించారు.
కేవలం మీడియా రంగమే కాకుండా, రామోజీరావు సమాజ సేవలో, తెలుగు భాషా సేవలో ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు. లాతూర్ భూకంపం, హుద్‌హుద్ తుఫాన్, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేవలం పిలుపునివ్వడమే కాకుండా, తన సంస్థ నుంచి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుపెట్టి సాయం చేసిన ఘనత ఆయనదని కొనియాడారు. అదేవిధంగా, తెలుగు భాషకు ఆయన చేసిన సేవను ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త తెలుగు పదాలను సృష్టించి, డిక్షనరీలను రూపొందించారని గుర్తుచేశారు. రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడటానికి ఒక ముఖ్యమంత్రిగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.
రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక విధానాన్ని చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. జర్నలిజం, గ్రామీణ అభివృద్ధి, కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారత వంటి ఏడు కీలక రంగాలలో అవార్డులు ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. “ఈ అవార్డులు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, దాదా సాహెబ్ ఫాల్కే, రామన్ మెగసెసె, పులిట్జర్ అవార్డులకు సమానంగా దేశంలో నంబర్ వన్ అవార్డుగా నిలుస్తాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
“ఈనాడు సంస్థ ఒక యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ పనిచేసిన వారే ఈరోజు దేశంలోని అన్ని పేపర్లలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు,” అని అన్నారు. రామోజీరావు లేకపోయినా, ఆయన స్ఫూర్తి, ఆయన వదిలి వెళ్ళిన విలువలు మనందరినీ నడిపిస్తాయని చంద్రబాబు అన్నారు. “నాకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి రామోజీరావుని తలుచుకుంటే ఆ కష్టాలను అధిగమించే శక్తి వస్తుంది” అని వ్యాఖ్యానిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉన్నత ప్రమాణాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.