CM Chandrababu: అర్నబ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఉమ్మడి విశాఖ, తూరు, పశ్చిమగోదారి జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మౌళిక సదుపాయాలు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.
ఏపీలో బీభత్సం చేసిన అర్నబ్ తుఫాను ఒడిషా వైపు మళ్లింది. ఈ తుఫాను వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్కన్‌గిరికి 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది పాడేరుకు 90 కి.మీ. దూరంలో కదులుతోంది. దీని కారణంగా ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వరల సహాయక చర్యలపై ఇప్పటివరకు అమరావతిని నుంచి అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు, నేరుగా ఫీల్డ్‌లోకి దిగనున్నారు. ఈ క్రమంలో గురువారం కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు అమరావతి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు కొందరు మంత్రులు.
ఈసారి మంత్రి వర్గం హైబ్రిడ్ విధానంలో జరుగుతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉండడంతో వారు అక్కడి నుంచి వర్చువల్‌గా హాజరు కానున్నారు. అర్నబ్ తుఫాను బాధితులకు సహాయక చర్యలపై కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. తుఫాను నష్టాలు, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై సమీక్షించనున్నారు.
గురువారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12.55 గంటలకు కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 నుంచి 1.30 గంటల వరకు వెట్లపాలెంలో రైతులతో మాట్లాడుతారు. తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.35 గంటల వరకు కాట్రేనికోన మండలం గచ్చకాయలపోరా తుఫాన్ పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతారు.
ALSO READ: అర్నబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. ఏపీలోని పాఠశాలలకు సెలవు, ఆ సమయంలో పరీక్షలు
బాధితులను నేరుగా కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని, జరుగుతున్న సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. దాని మధ్యాహ్నం 2.35 తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. చెయ్యేరు నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం ఉండవల్లికి రానున్నారు సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ లేక సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరాపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.