Chandrababu : ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు అండగా ఉంటారని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ బలమైన నాయకుడని.. ఆయన చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉంటుందన్నారు. సరైన సమయంలో, సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. మోదీ తీసుకున్న కులగణన నిర్ణయం బిగ్ గేమ్ ఛేంజర్ అన్నారు చంద్రబాబు. వందేమాతరం, భారత్ మాతాకి జై అంటూ నినదించారు.
5 కోట్ల ప్రజల సెంటిమెంట్
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం వెంటిటేటర్ మీద ఉందని.. ఇప్పుడిప్పుడే బయటకు వచ్చామని.. కేంద్ర సాయంతో ఏపీని బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. “అమరావతి కేవలం ఒక నగరం కాదు.. 5 కోట్ల ప్రజల సెంటిమెంట్ అన్నారు. ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలకు ప్రతిరూపం” అని చెప్పారు. అమరావతిపై ఐదేళ్లు విధ్వంసం చేశారని.. అమరావతి పున: ప్రారంభం రైతులు, రైతు కూలీల విజయమే అన్నారు. అమరావతి ఉద్యమకారులకు హ్యాట్సాఫ్ అంటూ.. రైతులకు సెల్యూట్ చేశారు చంద్రబాబు.
‘నా రాజధాని అమరావతి’ నినాదం
“నా రాజధాని అమరావతి” అని 5 కోట్ల ఆంధ్రులు ఘనంగా చెప్పుకునేలా రాజధానిని రూపొందిస్తామన్నారు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ సాయంతో.. మరో 3 ఏళ్లల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగానే ప్రపంచ స్థాయి నగరాన్ని ఆవిష్కరిస్తామన్నారు ఏపీ సీఎం. ప్రధాని మోదీ సూచించిన విధంగా.. జపాన్‌లోని మియావాకీ నగరం మాదిరి గ్రీన్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
2027లో పోలవరం పూర్తి..
టెక్నాలజీ అంటే నరేంద్ర మోదీ అని.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తామని, ఏఐ కేపిటల్‌గా మార్చుతామని చెప్పారు చంద్రబాబు. అమరావతితో పాటు 26 జిల్లాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహాకారంతో 2027కి పోలవరం పూర్తి అవుతుందని.. ఏపీలో నదులు అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాదికి భోగాపురం ఎయిర్‌పోర్టు కంప్లీట్ అవుతుందని చెప్పారు. గూగుల్, టీసీఎస్‌లు ఏపీకి వస్తున్నాయని.. లక్షన్నర కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పారు సీఎం చంద్రబాబు.
Also Read : వైసీపీని ఆటాడేసుకున్న లోకేశ్, పవన్