Amaravati 2.0 Launch: అమరావతి రైతుల త్యాగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రాజధాని పునః నిర్మాణ శంఖుస్థావపన కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు పాల్గొన్నారు.
ప్రధానికి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతిలో అపూర్వ స్వాగతం లభించింది. అమరావతి పునః నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని విమానాశ్రయం వద్దకు రాగానే మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అమరావతి వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు ప్రధాని మోడీ రాగానే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు. ఆ తర్వాత ప్రముఖుల ప్రసంగం సాగింది.
నలిగిపోయారు.. అలసి పోయారు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు గత ఐదేళ్లలో నలిగి పోయారని, అలసి పోయారని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మరీ పోలీసుల లాఠీ దెబ్బల రుచిని అమరావతి రైతులు చూశారన్నారు. వైసీపీ చేసిన దురాగతంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారు ఆ పాపాలు చేసినందుకే ప్రజాతీర్పు వారికి చెంపపెట్టు అన్నారు.
అమరావతికి అంకురార్పణ ఒక చారిత్రక ఘట్టమని, కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి ప్రజల ఆశయాలతో నిలిచిన రాజధాని నేడు పునఃప్రారంభ దిశగా అడుగులు వేయడం గర్వంగా ఉందన్నారు. ఇది ప్రజల గర్వానికి నిలువెత్తు నిదర్శనమని, అభివృద్ధి పునఃప్రారంభం అమరావతి నుంచి మొదలైందని పవన్ అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిర్మాణం మరింత వేగంగా సాగుతుందన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఇస్తున్న సహకారం మరువలేనిదని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి వైపు దూసుకెళుతుందని పవన్ అన్నారు.
పీకలేరు.. లోకేష్ వార్నింగ్
భారత్ ను పాకిస్తాన్ ఏం చేయలేదని, ఏమి పీకలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. లోకేష్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దెబ్బకు పాకిస్తాన్ గజగజ వణికి పోతుందని, అది మన ప్రధాని సత్తా అన్నారు. ఇక రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. అమరావతి అంటే ప్రధానికి ఎంతో ఇష్టమని, అందుకే బిజీగా ఉన్నా ప్రధాని అమరావతికి వచ్చారన్నారు. 2014 లో విభజన జరిగినప్పుడు మన రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
Also Read: Capital Amaravati: అమరావతికి దిష్టి తీయాలట.. మరీ ఇన్ని రికార్డ్స్ ఎలా?
ఏపీలో ఐదేళ్లు విధ్వంస పాలన సాగిందని, అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. కానీ రైతులు తగ్గేదెలే అనే తీరులో పోరాటం సాగించారని లోకేష్ అన్నారు. అమరావతిని పీకేద్దాం అని వైసీపీ ప్రయత్నించిందని, అదంతా ఆషామాషీ కాదని లోకేష్ అనగానే సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది.