SC Categorization: ఎస్సీ వర్గీకరణపై దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. రిజర్వేషన్ల వర్గీకరణపై నియమించిన ఏక సభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఎస్సీలను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రా ప్రతిపాదన చేసింది. అందులో రెల్లి-ఉప కులాలకు గ్రూపుకు ఒకశాతం, మాదిగ-ఉపకులాలకు 6.5 శాతం, మాల- ఉప కులాలకు 7.5 శాతంతో వర్గీకరణ అమలు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది.
ఎస్సీ వర్గీకరణ
గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలను నాలుగు కేటగిరీలు(ఏ,బి,సి,డి)గా ఉండేవి. తాజాగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మూడు కేటగిరీలకు పరిమితం చేసింది. దీని ప్రకారం రిజర్వేషన్‌ను వర్తింప చేయాలని ప్రస్తావించింది. ఈ రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా వర్తింప చేయాలన్నది ప్రధాన సూచన. ఈ మేరకు నివేదికను మంగళవారం రాత్రి సీఎస్ విజయానంద్‌కు సమర్పించారు రాజీవ్ రంజన్ మిశ్రా.
కేవలం మూడు గ్రూపులు
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో అమలుకు సీఎం చంద్రబాబు కమిటీ వేశారు. గత ఏడాది నవంబరు 15న ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి కమిషన్ వేశారు. రిటైర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించారు. అదే ఏడాది నవంబరు 27న కమిషన్ తన విధులు ప్రారంభించింది. దాదాపు 100 రోజులపాటు ఈ కమిషన్ అధ్యయనం చేసింది.
అన్ని వర్గాల నుంచి వివరాలు సేకరణ
ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించింది. మాల, మాదిగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అలాగే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వివరాలు తీసుకుంది. ఎస్సీ ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల తీరు తదితర వాటిని సేకరించింది. సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
ALSO READ: అన్ని కేసుల్లో పోసానికి బిగ్ రిలీఫ్
వచ్చేవారం ప్రకటన?
ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గం సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాని తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు. అంతా అనుకున్నట్లుగా జరిగితే వచ్చేవారం దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.