CMO: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల పీఏలు రెచ్చిపోతున్నారా? వారి ఆగడాలకు అంతు లేకుండా పోతుందా? హోంమంత్రి అనిత పీఏతో ఈ వ్యవహారం మొదలైందా? లైన్‌లో మరో ముగ్గురు మంత్రుల పీఏలు ఉన్నారా? ఇప్పటికే నివేదిక పార్టీ హైకమాండ్ కు చేరిందా? దీంతో సెక్రటేరియట్‌లో మంత్రుల పేషీలపై నిఘా నేత్రం ఓపెన్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ సెక్రటేరియట్‌లో మంత్రుల పేషీల్లో గుబులు మొదలైనట్టు కనిపిస్తోంది. మంత్రులపై పేషీలపై సీఎంఓ నిఘా పెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొన్నట్లు తెలుస్తోంది. దీని వెనుక హోం మంత్రి అనిత పీఏ జగదీష్ వ్యవహారమే కారణమా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
చంద్రబాబు సర్కార్ ఓ వైపు అభివృద్ది.. మరోవైపు పార్టీని పటిష్ట చేసే పనిలో పడ్డారు. కార్యకర్తలు నేరుగా వచ్చి పార్టీ ఆఫీసులో తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారు. వారి సమస్యలు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కార్యకర్తలను పక్కనపెట్టేసి, నచ్చినవారికి, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీఠ వేస్తున్నట్లు టీడీపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అంతేకాదు కొందరు మంత్రుల పీఏ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ప్రతీదానికి పైసా వసూల్ చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో మంత్రి అనిత పీఏ జగదీష్ బుక్కయ్యాడు. ఇతగాడి అరాచకాలు గురించి చెప్పనక్కర్లేదు.
ALSO READ: వన్ నేషన్.. వన్ వుడ్.. పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్
జగదీష్ పదేళ్లుగా నమ్మకంగా ఉండడంతో మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడ్ని కొనసాగించారు మంత్రి అనిత. ఇతగాడి ఆగడాలు శృతి మించడంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వెంటనే అతగాడ్ని తొలగించినట్టు మంత్రి అనిత స్వయంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు.
నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలపై ఫిర్యాదు జోరుగా రావడంతో మంత్రుల పేషీలపై సీఎంఓ నిఘా పెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి. అందులో నిజమెంతో తెలీదు. రెచ్చిపోతే మాత్రం వేటు తప్పదనే సంకేతాలు జగదీష్ వ్యవహారంతో మంత్రులకు బలంగా పంపింది కూటమి సర్కార్. బదిలీలు, పోస్టింగుల వ్యవహారంలో అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు దిగితే సహించేది లేదని తేల్చి చెప్పినట్లైంది.
మంత్రుల పని తీరుపై నివేదిక రెడీ అయినట్టు అంతర్గత సమాచారం. ఉత్తరాంధ్ర, కోనసీమ, గుంటూరు, రాయలసీమ ప్రాంతాలకు చెందిన తలా ఒక్క మంత్రి పీఏలపై సెటిల్మెంట్ ఆరోపణలు గుప్పుమన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందట. పనితీరు మార్చుకోవాలని కేవలం మంత్రులకే కాకుండా ఎమ్మెల్యేలకు సైతం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా ముందుగా టీడీపీ హైకమాండ్ చర్యలు చేపట్టినట్టు కనిపిస్తోంది.