Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధం చేస్తున్న వారాహి వాహన కలర్ పై వివాదం నడుస్తోంది. మిలటరీ వాహనాలకు వాడే రంగును ఎలా వాడతారని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది. అటు జనసేన అధినేత స్వయంగా రంగంలోకి దిగి ఎదురు ప్రశ్నించడంతో ఏపీలో పాలిటిక్స్ మళ్లీ ఒక్కసారి హీటెక్కాయి.
పేర్ని సెటైర్..
మిలటరీ వాహనాలకు వాడే ఆవివ్ గ్రీన్ రంగు ప్రైవేట్ వెహికిల్ కు వినియోగించడం నిషిద్ధమని మాజీ మంత్రి , వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నాని అన్నారు. పవన్ వాహనానికి నిషేధిత రంగు వాడారని ఆరోపించారు. ఆ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ అవ్వదని స్పష్టం చేశారు. మీరు ఎటూ రంగు మార్చాలి కదా… అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని జనసేనానికి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఎలాగూ టీడీపీతో కలిసి వెళ్లేవారే కదా? అని చురకలు అంటించారు. ప్రధాని మోదీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారని పవన్ ఉద్దేశించి అన్నారు. వ్యాన్లతో ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే ప్రతి ఒక్కరూ వాటినే కొనేస్తారని పేర్ని నాని విమర్శించారు. ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయని చురకలు అంటించారు. ఏపీ ప్రభుత్వం రక్షణ కల్పించకుండానే పవన్ కల్యాణ్ రాష్ట్రానికి వచ్చి, వైఎస్ఆర్ సీపీలోని కాపు నాయకులను తిడుతున్నారా? అని ప్రశ్నించారు.
పవన్ కౌంటర్..
పేర్ని నాని వ్యాఖ్యలపై జనసేనాని స్పందించారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ముందుగా తన సినిమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. విశాఖ వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారని ఆరోపించారు. మంగళగిరిలో కారులో వెళ్తుంటే అడ్డుకున్నారని పవన్ విమర్శించారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నా ఆపేశారని మండిపడ్డారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారని.. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ పవన్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని జనసేనాని ప్రశ్నించారు.
ముందు..ముందు.. ఎన్ని వివాదాలో..
మొత్తంమీద పవన్ వారాహి వాహనంలో ఎన్నికల ప్రచారానికి బయలు దేరకముందే వైఎస్ఆర్ సీపీ, జనసేన మధ్య పొలిటికర్ వార్ మొదలైపోయింది. అసలు పవన్ ఆ వాహనంలో యాత్రకు వెళితే ఇంకా ఎలాంటి వివాదాలు రాజుకుంటాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.