తిరుమల గోశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు ఇటీవల ఆరోపించారు. పోనీ అది రాద్ధాంతమే అనుకుందాం. ఆవులు చనిపోయింది నిజమే కానీ, దానికి కారణాలు వేరేనంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు భూమన కరుణాకర్ రెడ్డి రాద్ధాంతం రోడ్ షో అంతా విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోయింది. తాజాగా శ్రీకూర్మంలో తాబేళ్లు మరణించినా అధికారులు సరిగా పట్టించుకోలేదని, కింది స్థాయి సిబ్బంది వాటిని గుట్టు చప్పుడు కాకుండా దహనం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మరిప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుంది..? భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాక వారికి సమాధానం ఏం చెబుతారు..? ఏపీ దేవాదాయ శాఖ విషయంలో అప్రమత్తత అవసరం అని కచ్చితంగా తెలిపే సందర్భం ఇది.
నక్షత్ర తాబేళ్లు మృత్యువాత..
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం లోని కూర్మనాథ స్వామి ఆలయానికి అనుబంధంగా నక్షత్ర తాబేళ్లను సంరక్షిస్తుంటారు. స్వయానా విష్ణుమూర్తి కూర్మావతారంలో కొలువైన క్షేత్రం కావడంతో ఇక్కడ తాబేళ్లను దైవసమానంగా చూస్తుంటారు. తాబేళ్ల సంరక్షణను దేవాదాయ శాఖ చూస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఇక్కడ నక్షత్ర తాబేళ్లు మృత్యువాతపడుతున్నాయి. అలా మృతి చెందిన వాటిని నిబంధనల ప్రకారం పోస్టు మార్టం చేసి, మరణానికి కారణాలు కనుగొంటారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయని, వాటిని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తాబేళ్ల రక్షణను ఆలయ అధికారులు గాలికి వదిలేశారని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కిం కర్తవ్యం..?
తిరుమల గోశాల ఉదంతంలో ప్రభుత్వంవైపు తప్పు ఉందని నిర్థారణ కాలేదు. అదే సమయంలో అక్కడ గోవులు మృతిచెందిన విషయం పూర్తి అవాస్తవం కాదు. గోవుల మరణాలు జరిగాయి. కానీ వాటికి కారణాలు వేరు. అయితే ఇక్కడ కేవలం టీటీడీ నిర్లక్ష్యం వల్లే గోవులు చనిపోయాయని వైసీపీ ఆరోపిస్తోంది. అది తప్పని టీటీడీ, కూటమి ప్రభుత్వం ఎదురుదాడి మొదలు పెట్టింది. ఇందులో దాదాపుగా ప్రభుత్వానిదే పైచేయి కావడం విశేషం.
తిరుమలలో అపచారం..
తిరుమల గోశాల విషయంలో జరిగినదంతా రాజకీయమే అనుకున్నా.. క్యూ లైన్లో చెప్పుల వ్యవహారం మాత్రం ప్రభుత్వానికి మచ్చతెచ్చేదిలా ఉంది. గతంలో వైసీపీ హయాంలో తిరుమల కొండపై డ్రోన్ ఎగిరినా, విమానాలు వెళ్లినా ప్రతిపక్షాలు నానా రచ్చ చేసేవి. ఇప్పుడు కూటమి హయాంలో కూడా అలా జరగడం ఆక్షేపణీయం. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీతోపాటు దేవాదాయ శాఖది కూడా. కానీ పదే పదే అలాంటివి జరగడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా శ్రీకూర్మంలో జరిగిన ఎపిసోడ్ మరోసారి దేవాదాయ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. కాసేపు ప్రతిపక్షాన్ని పక్కనపెడతాం. సాధారణ భక్తులు కూడా ఇలాంటి విషయంలో కలతచెందుతారు. సాక్షాత్తూ కూర్మావతారుడైన కూర్మనాథుడి దేవస్థాన పరిసరాల్లో తాబేళ్లు వరుసగా మృత్యువాతపడటం, వాటిని ఎవరి కంటా పడకుండా దహనం చేయడం ఆందోళన కలిగించే విషయమే. ఎవరో దీన్ని వేలెత్తి చూపించడంకంటే ముందే దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి. కానీ అది జరగలేదు. అటు తిరుమల విషయంలో కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకుంది ప్రభుత్వం. అసలే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటూ అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంది. ఇలాంటి సందర్భంలో మరింత అలర్ట్ గా ఉండాలి. నష్టం జరక్కముందే నివారణ చర్యలు తీసుకోవాలి, లేకపోతే వైసీపీ విమర్శలను కాచుకోవాల్సిందే.