పోలీసుల్ని బట్టలూడదీసి నిలబెడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పుడల్లా చల్లారేలా లేదు. రాజకీయ నేతలు పార్టీలకతీతంగా జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలే కాదు.. వామపక్ష నేతలు కూడా జగన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సీపీఐ నారాయణ జగన్ పై పంచ్ లు విసిరారు. అయితే ఇక్కడ ఆయన గత ప్రభుత్వాన్ని, ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా తప్పుబట్టడం విశేషం.
ఏం చూస్తావ్ జగన్..?
“బట్టలూడదీస్తే ఏముంటుంది..? ఏం చూడాలనుకున్నారు..? ఆయనకేముంటదో మీక్కూడా అదే ఉంటది కదా..? మీకున్నదే ఆయనకి ఉంటది.. బట్టలూడదీస్తే ఏముంటదని..? ఇలాంటి పొగరుబోతు మాటలు ఎందుకు..? అవి కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నా.” అని అన్నారు నారాయణ.
వైఎస్ జగన్ పై CPI నారాయణ సెటైర్లు
పోలీసుల బట్టలూడదీసి జగన్ ఏం చూడాలి అనుకుంటున్నాడు?
జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనకు చప్రాసి లాగా పని చేశారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో జగన్ పోలీసులను వాడుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ సీఎంని… pic.twitter.com/LABMYXf1W5— ChotaNews App (@ChotaNewsApp) April 10, 2025
అప్పుడు చప్రాసీలు, ఇప్పుడు వాచ్ మెన్ లా..?
పోలీసులు ఇప్పుడు వాచ్ మెన్ లు గా మారిపోయారంటూ వైసీపీ నేతలు అనడం కరెక్ట్ కాదని అన్నారు సీపీఐ నారాయణ. గతంలో వైసీపీ అధికారంలో ఉందని, జగన్ కింద వేలమంది పోలీసులు పనిచేశారని, మరి అప్పుడు వారెలా పనిచేశారో తెలియదా అని ప్రశ్నించారు నారాయణ. అప్పుడు చప్రాసీలు అనుకుంటే ఇప్పుడు వాచ్ మెన్ లు అనుకోవాల్సి వస్తుందన్నారు. తాను ఈ రెండిట్నీ సమర్థించదనని చెప్పారు. అధికారంలో ఎవరు ఉంటే వారు చెప్పినట్టే చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. పోలీసులపై ఒత్తిడి పెంచి తమకు నచ్చినట్టు వారిని వాడుకోవడం కూడా కరెక్ట్ కాదన్నారు నారాయణ.
గతంలో ఏం చేశారు..?
వైసీపీ హయాంలో పోలీసులు ఎలా పనిచేశారో వివరించారు నారాయణ. అప్పట్లో చంద్రబాబుని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించే సమయంలో ఎఫ్ఐఆర్ రెడీ చేశారని, అలా ప్రవర్తించమని ఎవరు చెప్పారని నిలదీశారు. అప్పుడు అలా పోలీసుల్ని వాడుకోవడం వల్లే, ఇప్పుడిలా పోలీసులపై జగన్ విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. ఇక అప్పటి ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విషయంలో కూడా దారుణంగా ప్రవర్తించారని గుర్తు చేశారు నారాయణ. ఎంపీని అరెస్ట్ చేసి లోపలేసి ఉతికిపారేసిన ఘటనలు కూడా అప్పుడు చూశామన్నారు. ఎవరు అధికారంలోకి వస్తే, అంతకు ముందు యాక్టివ్ గా ఉన్నవారికి పనిష్మెంట్ ఇస్తున్నారని ఇది సరికాదని చెప్పారు. అధికారంలో ఎవరు ఉంటే వారు, పోలీసులపై అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటారని, రాజకీయాలు అలా మారిపోయాయని, సో.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, కూటమి అధికారంలోకి వచ్చాక మరోలా పోలీసులు ప్రవర్తిస్తారని అనుకోలేమని.. అలాంటప్పుడు జగన్ పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదన్నారు నారాయణ.
మొత్తమ్మీద జగన్ విషయంలో నారాయణ కాస్త ఘాటుగానే స్పందించారు. అవి పొగరుబోతు మాటలు అని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ నాయకులే కాదు ఏపీ పోలీసులు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు కూడా జగన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. విధి నిర్వహణలో ఉన్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, అది వారి మనో నిబ్బరాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. ఒక మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. కనీసం ఇకనైనా జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా, లేక ఎవరెన్ని విమర్శలు చేసినా సైలెంట్ గా ఉంటారా..? వేచి చూడాలి.