AP – Telangana : ఎండాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సైతం తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అవడంతో వానలు దంచికొడుతున్నాయి. ఇక ముందుముందు అంతా వానలే వానలు. వర్షం పడితే రైతులకు సంబరమే అయినా.. ప్రజలకు మాత్రం సంకటమే. వానలతో విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగి పడే ప్రమాదం ఉంది. కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టి చనిపోయే ఘటలను ఈ సమయంలోనే ఎక్కువ. వానకు ముందు వీచే గాలి దుమారం వల్ల విద్యుత్ స్తంభాలు, తీగలు నేల కూలుతుంటాయి. అనుకోని విపత్తులతో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్‌గా, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు ప్రమాదాలు వానాకాలం రాకముందే గట్టి హెచ్చరికలు ఇచ్చాయి.
బైక్‌పై తీగలు తెగిపడి..
హైదరాబాద్ కీసరలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న మహిళకు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కీసర నాగరంలోని బాపురెడ్డి కాలనీలో ఉండే సురేష్, మౌనిక దంపతులు.. తమ కుమారుడు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో సడెన్‌గా ఈదురు గాలులు వీచాయి. ఆ తీవ్రతకు విద్యుత్ తీగ తెగిపోయి.. బైక్‌పై పడింది. కరెంట్ షాక్‌కు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌కకు తరలించే లోపే భార్య మౌనిక మృతి చెందడం విషాదం నింపింది.
జాతరలో కరెంట్ వైర్లు తెగి..
ఏపీలోనూ శ్రీకాకుళం జిల్లాలోనూ కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కంచిలి మండలం తలతంపర పంచాయతీ పరిధి సామంత పుట్టుక అనే ఊర్లో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలా జరిగిందో ఏమో కానీ.. సడెన్‌గా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైరు తెగిపడింది. అది తగిలి ముగ్గురు మృతి చెందారు. చిల్ల ఈశ్వర్(28) తో పాటు ఇద్దరు చిన్నారులు నందిని (13), నొలియ కృష్ణ (3) చనిపోయారు. రెండేళ్ల చిన్నారి మనోజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read : పెళ్లికొడుకును కొబ్బరి బొండాంతో కొట్టే ఆచారం.. పగిలితే..?
వానాకాలం జాగ్రత్తలు..
వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ స్తంభాలను అస్సలు తాక కూడదు. కరెంట్ తీగల ముందు నిలుచో కూడదు. గాలి బలంగా వీస్తున్న సమయంలో ప్రయాణం చేయకుండా సురక్షిత ప్రదేశంలో ఆగితే మంచిది. గాలి బీభత్సం తగ్గాక.. రోడ్డును జాగ్రత్తగా గమనిస్తూ జర్నీ చేయాలి. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే.. కర్రతో వాటిని పక్కను జరిపే ప్రయత్నం అస్సలు చేయకూడదు. చాలా కేసుల్లో కర్రతో కరెంట్ తీగను జరిపే క్రమంలో పొరపాటున షాక్ తగిలిన ఘటనలు అనేకం ఉన్నాయి. వెంటనే విద్యుత్ శాఖకు ఫోన్ చేయాలి కానీ, మనంతట మనం ఎలాంటి సాహసాలు చేయకపోవడమే మంచిది. పశువులను తోలుకెళ్లే వాళ్లు సైతం దారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అప్రమత్తతే మనకు రక్ష అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ సారి నైరుతి ముందే వచ్చేసింది. వానలు బాగా కురుస్తున్నాయి. ప్రమాదాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వానాకాలం ఎంజాయ్ చేయండి.